కొడంగల్ రూరల్: సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్(ఓపీఎస్) విధానాన్ని పునరుద్ధరించాని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ), జన జాగరణ యాత్ర రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలివచ్చి పట్టణంలోని ఎంఆర్‌సీ భవనం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి కడా కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22 ఏళ్లుగా సీపీఎస్ విధానంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందిపరిచిన విధంగా ఓపీఎస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ అనంతరం జీవితానికి పాత పెన్షనే భరోసా ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ.. వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్వయంగా అందజేసి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్ ఈయూ జన జాగరణ యాత్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు పట్నం రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి ఆయూబ్, శ్రీనివాస్, పవన్, మల్లికార్జున్, రవూఫ్, వేణుగోపాల్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ


