దుద్యాల్: విద్యుదాఘాతంతో ఓ గేదె మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధి వాల్యానాయక్ తండాలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుల్య నాయక్ గేదే మేత మేస్తున్న క్రమంలో విద్యుత్ స్తంభానికి తగిలి, కరెంట్ షాక్‌తో అక్కడిక్కడే మృతి చెందింది. పాడి గేదే దుర్మరణంతో రూ.50 వేలు నష్టపోయానని, జీవనోపాధి కోల్పోయానని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
‘సర్’.. అచ్యుతాపూర్ అభినందనీయం
యాలాల: సర్ ప్రక్రియను వందశాతం పూర్తి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం అచ్యుతాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని బూత్ నంబర్ 187లో సర్ వందశాతం పూర్తయిందని తెలిపారు. నియోజకవర్గంలో కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపడుతుందనడానికి ఈ గ్రామమే నిదర్శనమన్నారు. అనంతరం బీఎల్‌ఓ జ్యోత్స్న, బీఎల్‌ఏ సత్యప్పగౌడ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గాయత్రి, ఎంపీడీఓ శ్రీనిజ, సర్పంచ్ శిరీష, సర్ నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్, మాజీ సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకులు హన్మంతు ఉన్నారు.
కేశంపేట: అనుమతులు లేకుండా తరలిస్తున్న రేషన్ బియ్యన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని వేములనర్వ శివారులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందండంతో వేములనర్వ శివారులో తనిఖీలు చేపట్టాం. ఈ తనిఖీల్లో ఓ బొలెరో వాహనంలో ముడావత్ చౌహాన్ నాయక్, వీరయ్య 14 క్వింటాళ్ల రేషన్ బియాన్ని తరలిస్తున్నట్టు గుర్తించాం. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనంతో పాటుగా 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఠాణాకు తరలించి వారిపై కేసు నమోదు చేసినట్టు సీఐ నరహరి తెలిపారు.
మూఢనమ్మకాలను తరిమికొట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మూఢ నమ్మకాలను తరిమికొట్టి సైన్స్ పరిజ్ఞానం పెంచాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్మయ్య సూచించారు. సోమవారం మండల కేంద్రంలో జేవీవీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురికి సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢనమ్మకాలు ప్రజల ప్రాణాలు బలిగొంటాయని సైన్స్‌ను ప్రజల్లోకి తీసుకుపోవలాన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించుకొని పురోగతి సాధించాలన్నారు. హర్షిత మహిళా కళాశాలలో సైన్స్‌పై అవగాహన కల్పించారు. లిమ్స్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ దినేష్, న్యాయవాది మిరియాల జగన్‌కు సభ్యత్వం అందజేశారు.
శంకర్‌పల్లి: ఓ వెంచర్‌లో కూలీ పనులు చేస్తున్న ఐదుగురు బాలకార్మికులకు సోమవారం ఆపరేషన్ ముస్కాన్ చేవెళ్ల జోన్ బృందం విముక్తి కల్పించింది. ఎస్‌ఐ సురేశ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో ఉన్న అర్భన్ ట్రిల్లా వెంచర్‌లో కొన్ని రోజులుగా బిహార్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు బాల కార్మికులు కూలీ పనులు చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న ఆపరేషన్ ముస్కాన్ చేవెళ్ల జోన్ బృందం వెంచర్‌పై దాడులు నిర్వహించి బాలకార్మికులను ఠాణాకు తరలించారు. అనంతరం వెంచర్ సూపర్‌వైజర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


