● శ్రీసంజీవస్వామి ఆలయ
పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే కసరత్తు
● రూ.2 కోట్లు మంజూరు చేయించమని మంత్రులకు వినతి
● సానుకూలంగా స్పందించిన అమాత్యులు
భక్తుల కల నేరవేరుతుంది
సంజీవస్వామికి వేలాది మంది భక్తులు ఉన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఏనాడూ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు విన్నవించాం. దేవుడి గుడిని కొత్తగా నిర్మిస్తే చూసి తరలించాలని స్థానికులు కోరుకుంటున్నారు.
– అశోక్‌రెడ్డి, మాజీ సర్పంచ్, దొంగఎన్కేపల్లి
నిధులు మంజూరు చేయిస్తా
శ్రీసంజీవస్వామి ఆలయా న్ని రూ.2 కోట్ల నిధులతో పునర్నిర్మించేందుకు కృషిచేస్తున్నాం. మా అభ్యర్థనపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలో నిధులు మంజూరు చేయించి, పనులు ప్రారంభమయ్యేలా చూస్తా.
– టి.రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి
దోమ: నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగి, వంద ఎకరాలకు పైగా భూములున్న శ్రీసంజీవస్వామి ఆలయానికి పునర్నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈవిషయంపై స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. ఇటీవల పరిగికి వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వివరించారు. ఎంతో విశిష్టత కలిగిన ఆలయం శిఽథిలావస్థకు చేరుకుందని, పునర్నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.2 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రులు అవసరమైన ప్రతిపాదనలు చేస్తామని హామీ ఇచ్చారు. పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సంజీవస్వామి ఆలయానికి 104 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి. అధికారులు రెండేళ్లకోసారి వీటికి కౌలు వేలం నిర్వహిస్తారు. వచ్చిన డబ్బును ఆలయం పేరున జమ చేస్తారు. ఇలా ఇప్పటివరకు రూ.20 లక్షలు పోగయ్యాయి. సంజీవస్వామి ఆలయ పునర్నిర్మాణం భక్తుల చిరకాల వాంఛ. మంత్రుల హామీ నెరవేరితే ఇది త్వరలోనే సాకారం కానుంది. ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించిన వెంటనే పనుల ప్రారంభానికి శ్రీకారం చుడుతామని ఎమ్మెల్యే చెబుతున్నారు.


