ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామకంఠం భూమిని అక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. మండలంలోని దండుమైలారంలో 4.5 ఎకరాల భూ వివాదంపై ఆరా తీసేందుకు సోమవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామకంఠ భూమి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ భూమి పూర్తిగా గ్రామ పంచాయతీ, పేద ప్రజలకు చెందాలని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నేతలతో కలిసి ప్రజల మద్దతుతో త్వరలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అంతకు ముందు రోడ్డుపై బెఠాయించి ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్‌గౌడ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


