పురాతన శిల్పాలను కాపాడుకోవాలి
● కొడంగల్ పట్టణానికి వెయ్యేళ్ల చరిత్ర
● పురావస్తు పరిశోధకుడు డాక్టర్ శివనాగిరెడ్డి
కొడంగల్: పట్టణంలోని తూర్పు కమాన్‌కు ఎడమవైపు వీధిలో ఉన్న కళ్యాణ చాళుక్యుల కాలం నాటి శిల్పాలను (పదవ శతాబ్ది) కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆదరణకు నోచుకోని పలు శిల్పాలను గమనించారు. నాగదేవత, నంది శిల్పాలు, కళ్యాణ చాళుక్య కాలం నాటి వీరుల శిల్పాలను పరిశీలించారు. సర్పాలతో పాటు కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో డాలు తలపై కిరీటం ధరించి నడుమ నుంచి కింద భాగం వరకు సర్పం, దేవతల ఆకారాన్ని కలిగి ఉన్న శిల్పాలు, చేతిలో ఈటలు ధరించి పులిని చంపుతున్న తల లేని వీరుని శిల్పం, వంటిపైన గంట పట్టెడ ధరించి చిన్న మోపురంతో తలలేని నంది, నల్ల శాసనం రాతిలో చెక్కిన శిల్పాలు కొడంగల్‌కు వెయ్యేళ్ల చరిత్రకు సాక్షంగా నిలుస్తున్నాయన్నారు. ఈ శిల్పాలు అలనాటి సంస్కృతికి చిహ్నంగా ఉన్నాయని తెలిపారు. వాటిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని రక్షించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ స్థపతి, సమతా మూర్తి రూపశిల్పి డీఎన్‌వీ ప్రసాద్, ఆలయ ధర్మకర్తలు నందారం శ్రీనివాస్, నందారం ప్రశాంత్, రత్నం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


