తగ్గేదేలే.. తవ్వుడే! | - | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే.. తవ్వుడే!

Jan 1 2026 1:47 PM | Updated on Jan 1 2026 1:47 PM

తగ్గేదేలే.. తవ్వుడే!

తగ్గేదేలే.. తవ్వుడే!

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

వాగులు, వంకలనుతోడేస్తున్న అక్రమార్కులు

రాత్రింబవళ్లు ట్రాక్టర్లతో రవాణా

అడ్డుపడితే దాడులకు

తెగబడుతున్న వైనం

‘మామూలు’గా చూస్తున్న పోలీసులు

బషీరాబాద్‌: జిల్లా సరిహద్దు మండలమైన బషీరాబాద్‌లో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. నెల రోజులుగా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అనుమతులు జారీ చేయకపోవడంతో వీరి పంట పండుతోంది. కాగ్నానదితో పాటు ఎక్మాయి పెద్దవాగు, చిన్నవాగు వాడుకల్లో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. వీరిని నిలువరించాల్సిన పోలీసు, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఎక్మాయి అడ్డాగా దందా..

మండలంలోని కాగ్నానది పరివాహక గ్రామాలైన మంతట్టి, రెడ్డిఘణాపూర్‌, కంసాల్‌పల్లి(ఎం), జీవన్గీ, క్యాద్గీరా, గంగ్వార్‌, నావంద్గీ. ఇందర్‌చెడ్‌లో ఇసుక తోడేస్తున్నారు. వీరికి ఎక్మాయి గ్రామం అడ్డాగా మారింది. ఇక్కడ సుమారు 20 మంది ట్రాక్టర్ల యజమానులు ముఠాగా ఏర్పడి పెద్దవాగును లూటీ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అనుమతులు నిలిపేయడంతో గ్రామాల్లో విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. ఇదే అదనుగా నిత్యం ఇసుక తోడి.. ఎక్మాయి, మైల్వార్‌, కంసాన్‌పల్లి, నీళ్లపల్లి, జలాల్‌పూర్‌, ఇస్మాయిల్‌పూర్‌, బషీరాబాద్‌, మంతన్‌గౌడ్‌, ఇందర్‌చెడ్‌ గ్రామాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారమంతా పోలీసుల సహకారంతోనే సాగుతోందనే ఆరోపణలున్నాయి. దీంతో ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు, సర్కారు ఖజానాకు చేరాల్సిన సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది.

అడ్డుకుంటే అంతే..

● రాత్రివేళల్లో ఓవర్‌ స్పీడ్‌తో తరలివెళ్లే ఇసుక ట్రాక్టర్లను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే, వారిపైకి ఎక్కించేందుకు కూడా వెనకాడటం లేదు.

● గతంలో ఇందర్‌చెడ్‌ వద్ద ఇసుక ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్‌ పైకి తీసుకెళ్లడంతో అతని కాలు విరిగింది. ఈ కేసులో ట్రాక్టర్‌ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

● రెండు నెలల క్రితం నంద్యానాయక్‌తండా వద్ద ఇసుక ట్రాక్టర్‌ను అడ్డుకోబోయిన ఇద్దరు కానిస్టేబుళ్లపైకి వాహనం దూసుకెళ్లింది. రెప్పపాటులో అప్రమత్తమైన పోలీసులు పక్కకు దూకడంతో ప్రాణాపాయమే తప్పింది.

● కొద్ది రోజుల క్రితం కంసాన్‌పల్లిలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఇద్దరు రైతులపై దాడి చేయగా, వారు తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే రైతులై తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

● ఎక్మాయి గ్రామానికి చెందిన మోహన్‌ రెరండు రోజుల క్రితం ట్రాక్టర్‌ ద్వారా ఎక్మాయి వాగు నుంచి మైల్వార్‌కు ఇసుక రవాణా చేశాడు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. బేరం కుదరడంతో ట్రాక్టర్‌ను వదిలేశారు. కానీ, వెనకాలే వస్తున్న మీడియా ప్రతినిధులను గమనించి, డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. వారి సూచన మేరకు ఇసుకను రోడ్డు పక్కనే పారబోసిన డ్రైవర్‌.. పోలీసులకు దొరకుండా ట్రాక్టర్‌తో ఉడాయించినట్లు కలరింగ్‌ ఇచ్చాడు.

ముఠాగా ఏర్పడిన ఇసుక తోడేళ్లు

ముఠాగా ఏర్పడిన ఇసుక అక్రమ వ్యాపారులు మండలంలో ఇసుక ఉన్న చోట గద్దల్లా వాలిపోతున్నారు. ఎక్మాయి గ్రామానికి చెందిన సుంకరి రమేశ్‌, జీడి శ్యామప్ప, ఎరుకలి ఆనంద్‌, మహిమూద్‌, నాదీర్గా మోహన్‌, పాండు(నావంద్గీ), బషీరాబాద్‌కు చెందిన జమీల్‌, బాలేసాబ్‌ తదితరులు ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇటీవలి కాలంలో వీరిపై ఆరోపణలు, ఫిర్యాదులు పెరిగాయని, వీరి కదలికపై నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, వీరి కనుసన్నల్లో ఇసుక రవాణా చేస్తున్న ఎంతో మంది పోలీసులకు పట్టుబడుతున్నారు. దొరికిన వారిని జరిమానా కోసం తహసీల్దార్‌ వద్దకు పంపిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. డీడీ రూపంలో రూ.5 వేల ఫైన్‌ చెల్లిస్తున్న అక్రమార్కులు మరుసటి రోజునుంచే దందా కొనసాగిస్తున్నారు.

ప్రత్యేక నిఘా పెట్టాం

అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న పలు ట్రాక్టర్లను సీజ్‌ చేశాం. ఇసుక తరలిస్తున్నారంటూ పలు గ్రామాల నుంచి తరచూ ఫోన్లు వస్తున్నాయి. కాగ్నా, పెద్దవాగు, రోడ్ల కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాం. సీసీ కెమెరాల ద్వారా ట్రాక్టర్లను గుర్తించి కేసులు పెడుతాం. అక్రమ రవాణాపై 100కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలి. ఇటీవల గోనూర్‌ వద్ద ఇసుక రవాణా చేస్తున్నారంటూ ఓ యువకుడు తప్పుడు సమాచారం ఇచ్చాడు. అలా చేస్తే చర్యలు తప్పవు.

– ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సీఐ, తాండూరు రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement