హెచ్‌ఎం వేతనంలో కోత
విధులకు ఎగనామం
బషీరాబాద్: అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఎక్మాయి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం సుప్రియ వేతనంలో అధికారులు కోత పెట్టారు. ఎవరి అనుమతి తీసుకోకుండానే బుధవారం ఆమె స్కూల్‌కు రాలేదు. మరో టీచర్ సౌమ్య కూడా సెలవులో ఉండడంతో పాఠశాల మూతపడింది. ఉదయమే వచ్చిన విద్యార్థులు ఆవరణలో ఆడుకుంటూ కనిపించడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. టీచర్లు రాలేదని చెప్పడంతో, ఫోన్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైల్వార్ కాంప్లెక్స్ హెచ్‌ఎం వెంకటయ్య ఎక్మాయి ప్రైమరీ పాఠశాల(హరిజన్‌వాడ)కు చేరుకుని విచారణ జరిపారు. హెచ్‌ఎం సుప్రియ రాలేదని తెలుసుకున్న మరో టీచర్ సౌమ్య మధ్యాహ్నం విధులకు హాజరయ్యారు. కనీస సమాచారం ఇవ్వకుండా, విధులను నిర్లక్ష్యం చేసిన సుప్రియ వేతనంలో ఒకరోజు జీతం కోత విధించామని, ఎంఈఓ ఆదేశంతో ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు సరిగ్గా రాకుండా తమ పిల్లల జీవితాలలో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు.


