గూండాలను తరిమికొడదాం | - | Sakshi
Sakshi News home page

గూండాలను తరిమికొడదాం

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

● టీడీపీలో రౌడీషీటర్లకే టికెట్లు ● అణగారిన వర్గాల వారికే వైఎస్సార్‌సీపీలో టికెట్లు ● పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ భూమన

తిరుపతి మంగళం : ఎన్నికల్లో ఓటు ద్వారా గూండాలను తరిమికొడదామని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతి నగరంలో మేయర్‌ అభ్యర్థి వాసుయాదవ్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులు సుశీలాదేవి, వెంకటేష్‌రాయల్‌, కోటూరు ఆంజనేయులు, మార్కెట్‌ గురవారెడ్డి సతీమణి లలితమ్మతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూమన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడే గూండాలకు ఓటెయ్యొద్దని కోరారు. చంద్రబాబు, లోకేష్‌ గూండాలు, రౌడీలను పెంచిపోషిస్తూ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రజాహితవు, నగర అభివృద్ధిని ఆకాంక్షించే వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థితో పాటు కార్పొరేటర్‌ అభ్యర్థులకు ఓట్లు వేస్తారా? లేక తిరుపతిని దోచుకుని, అరాచకాలు, రౌడీయిజం చేసే రౌడీషీటర్లు, హంతకులుగా ముద్ర ఉన్న టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారో నిర్ణయించుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న తిరుపతి నగరాన్ని రౌడీయిజం, గూండాగిరి, అరాచకాలు, దాడులతో అప్రతిష్టపాలు చేస్తున్న టీడీపీ మేయర్‌ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌ను కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓడించి తరిమికొడదామని కోరారు. భూ కబ్జాలు, రౌడీయిజం చేసే వ్యక్తి టీడీపీ మేయర్‌ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌ అయితే ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తూ కనీసం సొంత ఇల్లు కూడా లేని పేదవాడు వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వాసుయాదవ్‌ అని వివరించారు. వైఎస్సార్‌సీపీ నుంచి దాదాపు 80శాతం మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికే టికెట్లు ఇచ్చి కార్పొరేటర్‌ అభ్యర్థులుగా పోటీలో నిలబెట్టామని తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా, తిరుపతి నగర అభివృద్దే లక్ష్యంగా భావించే అభ్యర్థులు వైఎస్సార్‌సీపీ వాళ్లు అయితే, ఎన్ని అరాచకాలు చేశాం, ఎన్ని దాడులు చేశాం, ఎంతమందిని కొట్టామన్న వాళ్లతో పాటు 28మంది రౌడీ షీటర్లుగా పోలీస్‌ రికార్డుల్లోకి ఎక్కిన గూండాలకు టీడీపీలో టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ప్రజాసంక్షేమాన్ని ఏమాత్రం పట్టించకోలేదని విమర్శించారు. ఐదేళ్ల జగనన్న పాలనలో రూ. 3.లక్షల కోట్లను సంక్షేమం రూపంలో పేదలకు అందించారని గుర్తు చేశారు. తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్నకు కానుకగా అందిద్దామని కోరారు. ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement