తిరుమల: తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో గురువారం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం రోజున స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వదర్శనం భక్తులకు దర్శనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ మనోహరం, డిప్యూటీ ఈవోలు భాస్కర్, రాజేంద్ర, వేంకటేశ్వర్లు, సోమన్నారాయణ, రమాకాంత్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఐటీ జీఎం వేంకటేశ్వర్లు నాయుడు, ఎస్‌ఈలు వేంకటేశ్వర్లు, వేణుగోపాల్, వీజీవో సురేంద్ర, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ శాసీ్త్ర పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 68,004 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,964 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.91 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 06 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): తొట్టంబేడు మండలంలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఓటర్లతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు. బసవయ్యపాలెం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి అధికారులను ఓటింగ్ సరళిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 9 మండలాల్లో పర్యటించానని తెలిపారు.
ఎన్నికల బహిష్కరణ
తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): తొట్టంబేడు మండలం, మామిడిగుంట ఎస్పీ కాలనీ వాసులు పోలింగ్ స్టేషన్ మార్పుపై గురువారం ఆందోళనకు దిగి ఎన్నికలను బహిష్కరించారు. ఎప్పటి నుంచో పిల్లమేడు గ్రామంలో ఉన్న పోలింగ్ స్టేషన్లో తాము ఓటు వేసే వారమని, ఇప్పుడు కొత్తగా దయనేడు గ్రామానికి పోలింగ్ స్టేషన్ మార్చడంతో ఓటు వేయడం ఇబ్బందిగా ఉందని వారు వాపోయారు. తమకు ముందున్న పోలీస్ స్టేషన్‌ని కొనసాగించాలని నిరసన తెలియజేశారు. అయితే దీనిపై తొట్టంబేడు మండల ఎంపీడీవో సురేంద్రనాథ్ మాట్లాడుతూ.. మామిడి గుంట ఎస్సీ కాలనీ వాసులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు.
సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదల
తిరుపతి సిటీ: యూపీపీఎస్సీ ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన సివిల్స్ మెయిన్స్ పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 1,016 ఖాళీలకు గాను 2,526 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపికై నట్లు తెలుస్తోంది. ఇందులో చిత్తూరు, తిరుపతి జిల్లా నుంచి పలువురు అర్హత సాధించినట్లు ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.


