నాయుడుపేట టౌన్: నాయుడు పేట మున్సిపల్ చైర్పర్సన్ తంబిరెడ్డి రాజేశ్వరమ్మ, జనార్దన్‌రెడ్డి దంపతులు నెల్లూరులోని మాజీ మంత్రి కాకాణి నివాసం వద్దకు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాకాణి పూజిత, సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకులు బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రిని కలిసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, టీఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత తంబిరెడ్డి మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి, మారంరెడ్డి ముత్యాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అతే విధంగా పట్టణంలోని జువ్వలపాళెం రోడ్డు వద్ద ఉన్న తంబిరెడ్డి నివాసం, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయం వద్ద సందడి నెలకొంది. విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పార్టీ క్యాంపు కార్యాలయం వద్దకు చెరుకుని సంజీవయ్యతో పాటు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న టీడీపీ మూక
తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): తొట్టంబేడు మండలంలోని కాసరం, చోడవరం పోలింగ్ కేంద్రాలను గురువారం జనరల్ ఏజెంట్‌గా పరిశీలించడానికి వెళ్లిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని మద్యం మత్తులో టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. పోలీసులు చూస్తుండగానే వారు అరాచకం సృష్టించారు.
తల్లి వద్దకు చేరిన చిన్నారి
నాయుడుపేట టౌన్: నాయుడుపేట పట్టణంలోని అమరాగార్డెన్‌లో ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయిన చిన్నారి తల్లిదండ్రుల వద్దకు చేరింది. శ్రీకాళహస్తికి చెందిన దస్తగిరి – హుస్సేన్ కుమార్తె ఆసీఫ గురువారం ఉదయం ఇంటి ఎదుట ఆడుకుంటూ సమీపంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు వద్దకు చేరింది. రహదారి సమీపంలో ప్రభుత్వ అర్బన్ వైద్యశాల వద్ద ఉన్న డాక్టర్ మేరీ సలోమితో పాటు పనిచేసే శివ, ప్రసాద్, జేమ్స్ అనే వారు చిన్నారిని గుర్తించి ఆమె ఆచూకీ అడిగారు. చిన్నారి ఏమీ చెప్పలేక సమీపంలో ఉన్న కానూరు గ్రామం వద్దకు తీసుకువెళ్లి పాప అచూకీ కోసం ప్రయత్నించారు. అయితే పట్టణంలోని అమరాగార్డెన్‌లో ఉన్న పాప కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప తప్పిపోయిన విషయం సోషల్ మీడియాలో చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు బాలిక కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పాపను సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలికను సురక్షితంగా ఉంచి తల్లిదండ్రులకు అప్పగించేలా చేసిన ప్రభుత్వ వైద్యురాలితో పాటు సిబ్బందికి అమరాగార్డెన్ యువత శాలువాలు కప్పి కృతజ్ఞతలు తెలిపారు.


