ఎస్వీ, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల
విద్యార్థులకు టీడీపీ నేతల ఎర
రోజు కూలీ రూ.500, బిర్యానీ ఆశ చూపి తరలింపు
రైల్వేకోడూరు, తిరుపతి రూరల్ పోలింగ్ కేంద్రాల్లో మోహరింపునకు యత్నం
వెనక్కి పంపిన వైఎస్సార్‌సీపీ నేతలు
తిరుపతి సిటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగారు. రెండు రోజులుగా ఇంటింటికీ వెళ్లి ఓటుకు రూ.1000 నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేశారు. అప్పటికీ ఓట్లు తమకు వేస్తారో లేదో అనే అపనమ్మకంతో రిగ్గింగ్ చేసుకోవాలని భావించారు. గురువారం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాల వద్దకు దొంగ ఓటర్లను తరలించడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా తిరుపతి ఎస్వీ, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలతో పాటు పలు పీజీ కళాశాలల్లో చదువుతున్న పేద, గ్రామీ ణ విద్యార్థులను ఎంచుకున్నారు. రోజుకు రూ.500, బిర్యానీ ప్యాకెట్లు, రాత్రికి సినిమా టికెట్లు తీసిస్తామని ఆశ చూపారు. గురువారం ఉదయం తిరుపతి బస్టాండ్ సమీపం నుంచి వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు విద్యార్థులను తరలించే ప్రయత్నం చేశారు.
రైల్వేకోడూరు, తిరుపతి రూరల్ టార్గెట్
తిరుపతి నుంచి రైల్వేకోడూరు, తిరుపతి రూరల్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలకు విద్యార్థులను మినీ వ్యాన్‌లు, సుమోలు, జీపుల ద్వారా తరలించారు. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్సార్‌సీపీ నేతలు ప్రధాన రోడ్లలో వాహనాలను ఆపారు. ఎవరు.. ఎక్కడికి వెళుతున్నారంటూ ఆరా తీశారు. విద్యార్థులు అసలు విషయాన్ని బయటపెట్టడంతో అవాక్కయ్యారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న విద్యార్థులను వైఎస్సార్‌సీపీ నేత సాయికిషోర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. విద్యార్థులు స్పందిస్తూ తమను మభ్యపెట్టి రూ.500 ఇస్తామని కూటమి నేతలు వాహనాల్లో వెళ్లమన్నారని చెప్పుకొచ్చారు. తప్పు చేశాం.. క్షమించండి అంటూ బతిమలాడారు. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు నేరపూరిత పనులుచేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని వైఎస్సార్‌సీపీ నేతలు బుద్ధి చెప్పి తిరిగి వాహనాలను వెనక్కి పంపారు.


