పుత్తూరు: పట్టణానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా కుంట పొరంబోకు భూమిలో రోడ్డు నిర్మాణం చేపట్టారు. గురువారం మండల పరిషత్ ఎన్నికలు జరుగుతుండడంతో ఇదే అదనుగా పుత్తూరు మున్సిపాలిటీ 27వ వార్డులోని ప్రభుత్వ కుంట పొరంబోకు భూమిలో చకచకా సిమెంట్ రోడ్డు ఏర్పాటుచేస్తున్నారు. ఇదేదో ప్రజల కోసం అనుకుంటే పొరబాటే. ఈ భూమికి వెనక వైపున ఇటీవల కోట్ల రూపాయలు విలువైన ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. ఈ వెంచర్‌కు సరైన దారి లేకపోవడంతో పుత్తూరు–చిత్తూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కుంట పొరంబోకు భూమిని మీద వెంచర్ యజమాని కన్నుపడింది. వెంటనే అధికారంలో ఉన్న కూటమి నాయకుల్లో ప్రముఖుడిని సంప్రదించారు. సదరు భూమిని ఎలా స్వాధీనం చేసుకోవాలో, ఎప్పడు రోడ్డు వేసుకోవాలో సదరు నాయకుడు వెంచర్ యజమానికి దిశానిర్దేశం చేశారు. ఇందుకు ప్రతిఫలంగా సదరు కూటమి నాయకుడు వెంచర్ యజమాని నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము అందుకొన్నట్లు సమాచారం.
పక్కా ప్రణాళికతో ప్రభుత్వ భూమి ధారాదత్తం
పుత్తూరు మున్సిపాలిటీ 27వ వార్డు చెర్లోపల్లి రెవెన్యూ లెక్కదాఖలా సర్వే నంబర్ 116/1బిలోని 82 సెంట్ల గుంట పొరంబోకు భూమి ఉంది. ఈ భూమికి ఓపక్క చినరాజుకుప్పం ఎస్టీ కాలనీ, మరోపక్క ముస్లిం కాలనీ ఉంది. దీంతో 9 మంది ముస్లింలను సదరు భూమిలో 24 సెంట్లు వెంచర్ యజమానికి విక్రయించినట్లు అగ్రిమెంట్ చేయాలని సదరు కూటమి నాయకుడు ఆదేశించాడు. దీంతో వారు విధిలేక అగ్రిమెంట్ చేసి, కొంత సొమ్మును తీసుకొన్నట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన వెంచర్ యజమాని ఎన్నికల వేళ రోడ్డు నిర్మాణానికి ముహూర్తం పెట్టి దాదాపు సగం రోడ్డు వేసేశారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలా ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


