తిరుపతి అర్బన్: పారదర్శకంగా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్‌తో కలసి తిరుపతి లక్ష్మీపురం సమీపంలోని ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌లో పాల్గొంటున్న అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే అత్యధికంగా తిరుపతిలో 8 మండలాలకు చెందిన ఓట్ల లెక్కింపు ఉండడంతో టేబుల్స్‌తోపాటు సిబ్బందిని అధికంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో పరిసర ప్రాంతాలకు చెందిన నాలుగైదు మండలాల ఓట్ల లెక్కింపు జరిగేలా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. ఒకే బ్యాలెట్ బాక్స్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలు వేయడం వల్ల.... తొలుత వాటిని వేరు చేసి, అనంతరం జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను సంబంధిత సెగ్మెంట్ల వారీగా కలిపి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమాంతరంగా నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రతి కౌంటింగ్ హాల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోటీలో ఉన్న అభ్యర్థి లేదా వారి ఏజెంట్‌లో ఒకరికి మాత్రమే ఆర్‌ఓ టేబుల్ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో చంద్రగిరి నియోజకవర్గాలతో పాటు నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు, వడమాలపేట మండలాలకు సంబంధించిన మొత్తం 8 మండలాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మధ్యాహ్న భోజన సమయానికి ఎంపీటీసీ ఫలితాలు, సాయంత్రం 6 నుంచి 7 గంటల్లోపు జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మీడియా ప్రతినిధులకు కౌంటింగ్ కేంద్రాల వెలుపల ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
పటిష్ట భద్రత
ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి కలిగిన కౌంటింగ్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది, అధికారులను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఏఎస్సీ రవిమనోహరాచారి, తిరుపతి రూరల్ తహసీల్దార్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.


