తిరుపతి అర్బన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ మొదటి వారంలో తిరుపతికి రానున్న నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఐజీ క్రాంతి రాణా టాటా, డీఐజీ విశాల్ గున్నీ, ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ జయకృష్ణతో కలసి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని, ఇతర వీఐపీలకు పకడ్బందీగా వసతి కల్పించాలని కోరారు. ఐజీ క్రాంతి రాణా టాటా మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు దేశంలోనే అనేక మంది వీఐపీలు వస్తున్న క్రమంలో జిల్లాలోని ప్రముఖ హోటల్స్, హోం స్టేల్లో నందు వసతి ఏర్పాట్లు చేపట్టాలని, అలాగే అదనపు వసతి కోసం గదులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఉన్నతాధికారుల కోసం హోటళ్లలో వారి గోప్యత, సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పర్యటనకు కండిషన్ కలిగిన వాహనాలను సమకూర్చాలన్నారు. డీఆర్‌ఓ నరసింహులు, అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, శ్రీనివాస్, శ్రీలత, రామకృష్ణ, ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, డీపీఓ సుశీలదేవి తదితరులు పాల్గొన్నారు.
ఐసర్‌లో ఏర్పాట్ల పరిశీలన
ఏర్పేడు : ప్రధానమంత్రి నరేంద్రమోడీ డిసెంబర్ 5వ తేదీన ఏర్పేడు మండలంలోని తిరుపతి ఐసర్(భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోదన సంస్థ)కు రానున్న నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఐజీలు క్రాంతిరాణా టాటా, డీఐజీ విశాల్ గున్నీ, ఎస్పీ సుబ్బరాయుడు ఏర్పాట్లను పరిశీలించారు. ఐసర్ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు, బస సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే ఏ తిరుపతి ఐఐటీలో వీవీఐపీల బస ఏర్పాట్లపై చర్చించారు.


