– IIలో
ముక్కంటి హుండీ లెక్కింపు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు.
తిరుపతి మంగళం : తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని, పారదర్శంగా ప్రక్రియ పూర్తి చేయాలని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా టీడీపీ గూండాలు చేసిన అరాచకాలకు పోలీసులు సహకరించారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గూండాలు రిగ్గింగ్‌కు పాల్పడితే మళ్లీ కోర్టును ఆశ్రయించి వారికి సహకరించిన పోలీస్, ఎన్నికల అధికారులందరినీ న్యాయస్థానం ముందు నిలబెడుతామని హెచ్చరించారు. పోలీసులు, అధికారులు కార్పొరేషన్ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిపించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. నామినేషన్ల దశలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎదుర్కొన్న బెదిరింపులు, దౌర్జన్యాలు, మహిళా అభ్యర్థులపై జరిగిన దాడుల నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. న్యాయస్థానం ఆదేశాల అనంతరం నామినేషన్ల ప్రక్రియ ముందుకు సాగిందని వెల్లడించారు. అయినప్పటికీ, ప్రస్తుతం కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు మేయర్ అభ్యర్థిని కూడా కొందరు రాజకీయ ప్రత్యర్థులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరగనివ్వబోమని, ఏకపక్షంగా రిగ్గింగ్ చేస్తామని, పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపిస్తామని, తమను ఎవరూ అడ్డుకోలేరని, పోలీసుల మద్దతు తమకే ఉందని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతోందని వెల్లడించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనవని, వీటిపై అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుపతి నగరంలో ఎన్నికల సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించడం, ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడడం అధికారుల బాధ్యతని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫుటేజీని భద్రపరచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


