జగనన్న సంక్షేమ పథకాలే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయి
వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి వెల్లడి
తిరుపతి మంగళం : చంద్రబాబు పాలనలో లోకేష్ అండదండలతో టీడీపీ గూండాలు పేట్రేగిపోతున్నారని కర్నూలు, నంద్యాల జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అబద్ధాలు, మోసాలతో ప్రజలను వంచించి ఓట్లు దండుకోవడం చంద్రబాబు నైజమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలంతా చరమగీతం పాడనున్నారని చెప్పారు. తిరుపతిలో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వాసుయాదవ్‌తో పాటు స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర ప్రజలకు గానీ చేసిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో 143 హామీలు గుప్పించి అధికారంలోకి రాగానే విస్మరించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు, అక్రమ కేసులు తప్ప ప్రజాసంక్షేమం కోసం ఏ ఒక్కటైనా చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ రౌడీలను పెంచిపోషిస్తూ రాష్ట్రాన్ని గూండారాజ్యంగా తయారు చేశారన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఓటింగ్ సమయంలో విచ్చల విడిగా రిగ్గింగ్ చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
రెండున్నరేళ్లలో ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదు


