రగ్బీ పోటీల్లో ఎస్పీడబ్ల్యూ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రగ్బీ పోటీల్లో ఎస్పీడబ్ల్యూ విద్యార్థుల ప్రతిభ

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

● బాధ్యులపై ఫిర్యాదు ● సిబ్బందిపైనా క్రమశిక్షణ చర్యలు

తిరుపతి సిటీ: కర్నూల్‌ ఆదర్శ జూనియర్‌ కళాశాల వేదికగా ఈనెల 10 నుంచి రెండు రోజుల పాటు జరిగిన 70వ ఎస్‌జీఎఫ్‌ రగ్బీ అండర్‌–19 అంతర్‌ జిల్లా టోర్నమెంట్‌లో శ్రీ పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఓవరాల్‌ చాంపియన్స్‌గా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ భువనేశ్వరి ప్రతిభ చూపిన విద్యార్థినులు చైతన్యలక్ష్మి, హారిక, చంద్రకళను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సదర్భంగా ఫిజికల్‌ డైరెక్టర్‌ సాయి సుమతిని ప్రిన్సిపల్‌ అభినందించారు.

ముక్కంటి సేవలో

దత్తపీఠం అవధూత

శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని మంగళవారం మైసూరుకు చెందిన దత్తపీఠం అవధూత దత్త విజయేంద్ర తీర్థస్వామిజీ దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈవో బీకే వెంకటేశులు, వేదపండితులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద ఆయనకు ఈవో స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు.

గుర్తుతెలియని

మహిళ ఆత్మహత్య

తిరుపతి క్రైం : నగరంలోని పీకే లేఔట్‌లో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌న్‌ పరిధిలోని ఆంజనేయస్వామి ఆలయం వెనుకవైపు ఉన్న లక్ష్మీనిలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సదరు మహిళకు సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా. నివాసంలోని మేడపైకి వెళ్లే నిచ్చెనకు చీరతో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలు ఆకుపచ్చ రంగు డిజైన్‌ బ్లౌజ్‌, నల్లటి లంగా, ఆకుపచ్చ రంగు డిజైన్‌ చీర ధరించి ఉంది. ఆమె రెండు చేతుల ముంజేతులపై ప్రత్యేకమైన ఆకారాలతో పచ్చబొట్లు ఉన్నాయి. రెండు చేతులకు గాజులు, ముక్కుకు ముక్కుపుడక ధరించి ఉంది. ఆమె ఆచూకీ తెలిసిన వారు తిరుపతి ఈస్ట్‌ పోలీసులను సంప్రదించాలని కోరారు.

శ్రీవారి ఆలయం ఎదుట రీల్స్‌

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట నృత్యం చేస్తూ రీల్స్‌ చిత్రీకరించిన ఘటనపై టీటీడీ స్పందించింది. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన వ్యక్తులపై తిరుమల వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఘటన జరిగినప్పుడు విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలతోపాటు మాడ వీధుల్లో రీల్స్‌, వీడియోల చిత్రీకరణ పూర్తిగా నిషేధమని టీటీడీ స్పష్టం చేసింది.

యువకుడి మృతి

కలువాయి(సైదాపురం): రోడ్డు ప్రమాదంలో కలువాయికి చెందిన గుంజి చందు (23) మృతి చెందారు. ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అతను నెల్లూరు నుంచి బైక్‌పై కలువాయి వచ్చే క్రమంలో సోమవారం రాత్రి బైక్‌ గుంతలధాటికి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంతో చందు అక్కడికక్కడే మృతిచెందాడు.

తెలుగు తమ్ముళ్లకు చుక్కెదురు

రేణిగుంట: బీజేపీ నాయకత్వానికి తలోగ్గిన టీడీపీ అధిష్టానం రేణిగుంట జడ్పీటీసీ స్థానంలో కూటమి తరుపున పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థి జీపాల్యం తేజోవతికి బీఫాం ఇవ్వడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం. టీడీపీ తరపున ఇద్దరు అభ్యర్థులు జడ్పీటీసీ స్థానానికి నామినేషన్లు వేశారు. బీజేపీ తరఫున ఒకరు నామినేషన్‌ వేశారు. అందరూ జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం టీడీపీ అభ్యర్థికి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన మంగళవారం మధ్యాహ్నం టీడీపీ నాయకులకు షాక్‌ ఇస్తూ బీజేపీ తరుపున తేజోవతికి బిఫామ్‌ ఇచ్చారు. దీంతో టీడీపీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరణ చేసుకున్నారు. టీడీపీ మండల స్థాయి నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు ఈ నిర్ణయాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement