నిరసన ర్యాలీలో ప్రభుత్వానికి
వ్యతిరేకంగా నినాదాలు
రుయాలో వైద్య సేవలకు
కొంత అంతరాయం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు
తిరుపతి తుడా: జూడాల ఆందోళన ఉధృతమైంది. స్టైఫండ్‌ను 30శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ జూడాలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎస్వీ మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలనూ బహిష్కరించారు. నిరసన దీక్ష శిబిరం నుంచి 680 మంది జూనియర్ డాక్టర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దీక్ష శిబిరంలో కూర్చుని నినాదాలు మిన్నంటించారు. తమ న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని జూనియర్ డాక్టర్లు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టైఫండ్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గడిచిన ఐదు రోజులుగా ఓపీ సేవలను, తరగతులను బహిష్కరించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో అత్యవసర వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశామని చెప్పారు.
అత్యవసర వైద్య సేవల బహిష్కరణ
165 మంది రంగంలోకి
జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణతో రుయా ఆస్పత్రిలో పేదల వైద్యానికి కొంత అంతరాయం ఏర్పడింది. వందలాదిమంది రోగులు అత్యవసర వైద్యం ఓపీ సేవలకు వస్తుంటారు. రోగులకు వైద్యం అందించడంలో జూనియర్ డాక్టర్లే కీలకంగా వ్యవహరిస్తుంటారు. సుమారు 680 మంది జూడా లు విధులు బహిష్కరించడంతో వైద్య సేవలకు కొంత అంతరాయం ఏర్పడింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు రుయా సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రొఫె సర్లు, సివిల్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీహెచ్‌సీ, యూహెచ్‌సీ వైద్యులు, బీహెచ్‌ఎంఎస్ వైద్యులు మొత్తం 165 మందిని రంగంలోకి దింపారు.


