తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పీఎం–ఉషా ఆధ్వర్యంలో ‘అగ్రి టెక్ వితౌట్ బోర్డర్స్’ పేరుతో అంతర్జాతీయ విద్యార్థి మొబిలిటీ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. యూనివర్సిటీతో పాటు అంతర్జాతీయ సంబంధాల కేంద్రం (సీఐఆర్), హోమ్‌సైన్స్ విభాగం, మలేషియాలోని యూనివర్సిటీ మలేషియా తెరెంగానూ (యూఎంటీ) సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన హోమ్‌సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్.రజని మాట్లాడుతూ యూఎంటీకి చెందిన 19 మంది విద్యార్థులు హాజరై అంతర్జాతీయ విద్యా అనుభవం, పరస్పర అభ్యసనం ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వస్తున్న సాంకేతిక మార్పులపై చర్చించడం అభినందనీయమన్నారు. పీఎం – ఉషా సమన్వయకర్త ప్రొఫెసర్ సి.వాణి, సీఐఆర్ కన్వీనర్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి, యూఎంటీ సీనియర్ లెక్చరర్ డాక్టర్ మన్నూర్ ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీ–యూఎంటీ మధ్య సంయుక్త విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల పరస్పర మార్పిడి వంటి చర్యల ద్వారా సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీ అంతర్జాతీయ సంబంధాల కేంద్రం అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ టి.జి.అమృతవల్లి పాల్గొన్నారు.


