వరదయ్యపాళెం: మండలంలోని నాగానందపురం వద్ద తెలుగు గంగ కాలువలో సోమవారం ఉదయం ఓ మహిళ మృతదేహం లభించింది. ఉపాధి కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు కేవీబీపురం మండలం సూరమలకు చెందిన భువనేశ్వరి(55)గా గుర్తించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని సత్యవే డు ఆస్పత్రికి తరలించి, కుమారుడు మునయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.
గుర్తుతెలియని వృద్ధురాలి మృతి
తిరుపతి క్రైం: తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వృద్ధురాలు సోమవారం మృతి చెందింది. రుయా ఆస్పత్రిలోని మహిళా మెడికల్ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలిని ఈ నెల 4న చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. వృద్ధురాలి మృతదేహాన్ని రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆమెకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.


