అయ్యో.. కొత్తగుంట చిన్న చెరువు! | - | Sakshi
Sakshi News home page

అయ్యో.. కొత్తగుంట చిన్న చెరువు!

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

● భూ మాఫియాకు అండగా అధికార టీడీపీ నేతలు ● తిరుచానూరులో 3.98 ఎకరాల స్థలంలోకి అక్రమ చొరబాటు ● ఆ భూమి తనదేనంటూ దుబాయిలో ఉంటున్న ఓ వ్యక్తి ఫిర్యాదు

తిరుపతి శివారులో రూ.200 కోట్ల భూమి హాంఫట్‌!

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ప్రభుత్వ భూమే కదా.. ఎవరు అడుగుతారులే అన్న ధీమానో.. అధికార టీడీపీ నేతల అండ ఉందన్న నమ్మకమో.. రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై భూ మాఫియా కన్నేసింది. తిరుచానూరు పరిధిలోని కొత్తగుంట చిన్నచెరువును చెరబట్టింది. ఏకంగా 3.98 ఎకరాల భూమిని కొట్టేసేందుకు సిద్ధమయ్యింది. ఆ భూమిలోకి అక్రమంగా చొరబడి యంత్రాలతో చదును చేయడం మొదలు పెట్టింది. ఈ వ్యవహారంలో తిరుపతి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు దుబాయిలో నివసిస్తున్న ఓ వ్యక్తి ఈ భూమి తనదేనంటూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. అసలు ఆ భూమి ఎవరిది?.. ప్రభుత్వ భూమిలోకి ఎవరు చొరబడ్డారు?.. కబ్జా వెనుక ఉన్నది ఎవరు?.. అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం రావాల్సి ఉంది.

రికార్డులున్నాయని బుకాయింపు

తిరుపతి రూరల్‌ మండలం, తిరుచానూరు గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నం.254/4లోని 3.98 ఎకరాల భూమి కొత్తగుంట చిన్న చెరువుగా ఆన్‌లైన్‌ రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. అయినా భూ కబ్జాదారులు జేసీబీలు పెట్టి చదును చేస్తున్నారు. కబ్జాదారులు ఆ భూమికి సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు సివిల్‌ మ్యాటర్‌ తమకు ఎందుకని వదిలేయడం గమనార్హం.

‘అధికార బలం’తోనేనా?

ఆ భూమిలో ఇప్పటికే ప్రహరీ నిర్మాణం చేసిన వ్యక్తి విదేశాల్లో ఉండడాన్ని ఆసరాగా చేసుకుని భూమా ఫియా ఆ స్థలంలోకి ప్రవేశించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. భూ మాఫియా వెనుక టీడీపీ నేతల హస్తం ఉందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

భూమి పత్రాలున్నా.. చొరబడ్డారు

దుబాయిలో నివాసముంటున్న పాండురంగన్‌ మొదలియార్‌ ఆనే వ్యక్తి ఆ భూమి తమదేనని పోలీసులను ఆశ్రయించారు. భూ ఆక్రమణదారుల నుంచి తన భూమిని కాపాడాలని ఫిర్యాదు చేశారు. తనకు సంబంధించిన పత్రాలను ఫిర్యాదుతోపాటు పోలీసులకు అందించినట్లు సమాచారం. ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

ఉక్కుపాదం ఎప్పుడు?

తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లో భూముల విలువ భారీగా పెరిగింది. దీంతో ప్రైవేట్‌, ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. భూ మాఫియాకు అధికార పార్టీ నేతలు అండగా నిలబడడంపై విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు తమ భూములకు రక్షణ లేకుండాపోతోందన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పలుకుబడితో భూములను కబ్జా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగంపై ఉన్నప్పటికీ తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో అలాంటి చర్యలు ఏవీ తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కోట్ల విలువైన భూముల్లో అక్రమ చొరబాట్ల వెనుక ఉన్న వ్యక్తులు, వారికి సహకరిస్తున్న శక్తులు, రాజకీయ సంబంధాలపై కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement