తిరుమల: తిరుపతికి చెందిన వేంకటేశ్వర మోటార్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ లోకనాథరెడ్డి సోమవారం రూ.15.24 లక్షల వైలువైన ఎస్‌ఎంఎల్ మహీంద్ర ట్రక్‌ను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు వాహన తాళాలను అందజేశారు.
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
రేణిగుంట: మండలంలోని వెంకటాపురం సమీపంలోని ఇటుకుల తయారీ కేంద్రంలో నివాసం ఉంటూ కూలి పనులు చేస్తున్న కె.చిరంజీవి (24) సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... తవణంపల్లి మండలం, ముత్తరపల్లికు చెందిన చిరంజీవి వివాహ సమయంలో చేసిన రూ.4 లక్షల అప్పును తీర్చేందుకు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 9వ తేదీ రాత్రి తన సోదరి చందనకు ఫోన్ చేసి అప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తీర్చడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు పక్కనే నివాసం ఉంటున్న వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చూడగా, చిరంజీవి నివాసముంటున్న రేకుల షెడ్డు పైకప్పులోని ఐరన్ రాడ్‌కు చీరతో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతుని భార్య నాగవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రేనిగుంట పోలీసులు తెలిపారు.
ఔషధ మొక్కలు వరం
తిరుపతి సిటీ: ఔషధ మొక్కలు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత ఆవుల చంద్రశేఖర్ తెలిపారు. మానవ నాగరికత ఆరంభం నుంచి రోగాల నివారణకు, ఆరోగ్య పరిరక్షణకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఏపీఎంఏపీ బోర్డు సహకారంతో సోమవారం ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కల ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ఆయుర్వేద, సంప్రదాయ వైద్య విధానాల్లో ఔషధ మొక్కల పాత్ర చాలా కీలకమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. వేణుగోపాల్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ మల్లికార్జునరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
తడ: జాతీయ రహదారిపై కొండూరు గ్రామం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మాంబట్టు పరిధిలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేసే గంటి క్రాంతికుమార్(32) మృతి చెందాడు. ఎస్‌ఐ కొండపనాయుడు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, ఎరుకలపూడి గ్రామానికి చెందిన క్రాంతి తన బంధువైన దుగ్గిరాల మండలం, మంచికలపూడి గ్రామానికి చెందిన నరశింహారావుతో కలసి మాంబట్టు పరిశ్రమలో హమాలీలుగా పనిచేస్తూ కాదలూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు. విధులు ముగించుకున్న ఇద్దరూ ఒకే బైకుపై ఇంటికి బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లో తమ నివాసాలకు చేరుకుంటారనగా చైన్నె నుంచి సూళ్లూరుపేట వైపు వెళుతున్న లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక భాగంలో కూర్చుని ఉన్న క్రాంతి కింద పడడంతో అతని తలపై నుంచి లారీ వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న నరశింహారావు స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఎస్‌ఐ కొండపనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పటుకుని కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు చిన్నారులైన కుమార్తెలు ఉన్నారు.


