వాచ్‌మన్ లేక ఇక్కట్లు
రేణిగుంట: రేణిగుంట పీహెచ్‌సీ సమస్యల వలయంలో కూరుకుపోయింది. రాత్రి వేళ వాచ్‌మన్ లేక మహిళా సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. పీహెచ్‌సీ పట్టణానికి చివరన ఉండడం.. రాత్రి విదులు నిర్వహించే సిబ్బందికి సరైన రక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి చుట్టుపక్కల మందుబాబుల ఆగడాలు సైతం శ్రుతిమంచుతున్నాయి. రాత్రి పూట హాస్పిటల్ ప్రాంగణంలో లైట్లు కూడా లేకపోవడంతో చిమ్మచీకట్లో ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురికావాల్సి వస్తోంది. అన్నస్వామిపల్లి దారి నుంచి హాస్పిటల్ లోపలికి వెళ్లే దారిలో చీకటి అలముకుంటోంది. రేణిగుంట రైల్వే జంక్షన్ కావడం వల్ల ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. రాత్రి సమయాల్లో అధికంగా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఇక్కడ వైద్యం పొందుతుంటారు. వాచ్‌మన్ లేకపోవడంతో గేటు అవతలి నుంచే రోగిని విచారించి లోనికి అనుమతించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీనికితోడు ఏఎన్‌ఎంలకు నైట్ షిఫ్ట్‌లు వేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్టు సమాచారం. రాత్రి వేళ కూడా స్థానికంగా డాక్టర్ ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


