అర్హత ఉన్నా తల్లికి వందనం పథకానికి ఎంపిక చేయలేదు. తిరుపతి రూరల్‌లోని దుర్గసముద్రంలో 6వ తరగతి చదువుకుంటున్న ఎన్.గీతశ్రీ తన తాతయ్యతో కలసి కలెక్టరేట్‌లో అర్జీని ఇచ్చింది. తమ తల్లిదండ్రులు ఎన్.మురళీకృష్ణ, రాజ్యలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారని, పేదలైన తమకు తల్లికి వందనం ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. అలాగే మంగళం క్వార్ట్స్‌లో నివాసం ఉంటున్న ఎన్. హేమంత్‌రెడ్డి 1వ తరగతి చదువుకున్న క్రమంలో తమకు తల్లికి వందనం ఇప్పించాలని కోరారు. తల్లిదండ్రులు ఎన్.హరికృష్ణ, ఎన్.కౌసల్యతో కలిసి అర్జీ సమర్పించారు.
ఇదేమి చోద్యం సారూ
కలెక్టరేట్‌లో ప్రతి వారం వందలాది మంది అర్జీదారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అర్జీలు సమర్పిస్తుంటారు. అయితే ఒక్కరైన తాము ఇచ్చిన అర్జీకి పరిష్కారం చూపించినట్లు చెప్పడం లేదు. అయితే కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం వ్యాపారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రకృతి సేద్యం ద్వారా పండించిన కూరగాయలంటూ ఒక చిన్నపాటి కూరగాయల దుకాణం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇక్కడ అనేక దుకాణాలు ఏర్పాటు చేశారు. సోమవారం వస్తే సంత లాగా కూరగాయలు, పండ్లు, వివిధ రకాల తినుబండారాలు ప్రత్యక్షం అవుతున్నాయి. వీటిని చూసి అర్జీదారులు ఔరా..! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.


