4.01లక్షల ఓట్లు భద్రమేనా..? | - | Sakshi
Sakshi News home page

4.01లక్షల ఓట్లు భద్రమేనా..?

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

తిరుపతి అర్బన్‌ : ఓటు విలువ తెలిసిందే. అయితే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) పేరుతో జూన్‌ 15 నుంచి జూలై 24 వరకు 40 రోజుల పాటు ఇంటింటా సర్వే కింద బీఎల్వోలు పరిశీలన చేపట్టారు. అయితే సర్‌ ప్రక్రియ జూలై 24తో ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేక ముసాయిదా ఓటర్ల జాబితాను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ వెల్లడించారు. జిల్లాలో 14,81,603 మంది ఓటర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో ఉన్నారు. అయితే సర్‌ ప్రక్రియకు ముందు జిల్లాలో 17,69,429 మంది ఓటర్లు ఉండేవారు. అయితే సర్‌ ప్రక్రియ అనంతరం జిల్లా వ్యాప్తంగా 2,87,826 మంది ఓటర్లు తగ్గిపోయారు. మరోవైపు 1,62,230 మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో ఉన్నప్పటికీ వీరు ఓట్లు మ్యాపింగ్‌ కాలేదు. అలాగే వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు 2,38,980 మంది ఉన్నారు. మొత్తంగా 4,01,210 ఓటర్లకు నోటీసులు రేపు మాపో పంపనున్నారు. అనంతరం ఎలక్షన్‌ కమిషన్‌ సూచించిన మేరకు 11 రకాల గుర్తింపుల్లో ఏదో ఒక్కటి వారు బీఎల్వోలకు చూపించాలి. సరైన గుర్తింపుకార్డును అందించి...బీఎల్వోలు ఓకే చెబితేనే ఆయా ఓట్లకు భద్రత ఉంటుంది.

జర్నలిస్ట్‌ సునీల్‌కి చికిత్స

తిరుపతి తుడా : టీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసు కారణంగా రిమాండ్‌లో ఉన్న జర్నలిస్టు సంజీవ్‌ సునీల్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఈ మేరకు ఆదివారం తిరుపతి సబ్‌ జైలు నుంచి సునీల్‌ని రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయాల కారణంగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నానని ఆయన జైలు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. వైద్య అవసరాన్ని గుర్తించిన అధికారులు హుటాహుటిన రుయా కు తీసుకువచ్చారు. ప్రస్తుతం సునీల్‌ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.

12 నుంచి ఈఏపీసెట్‌ బైపీసీ స్ట్రీమ్‌ కౌన్సెలింగ్‌

తిరుపతి సిటీ : ఈఏపీసెట్‌ బైపీసీ స్ట్రీమ్‌ ద్వారా అగ్రికల్చరల్‌ అండ్‌ ఫార్మసీ యూజీ కోర్సులలో ప్రవేశాల కోసం తొలి దశ అడ్మిషన్లలో భాగంగా కౌన్సిలింగ్‌ ప్రక్రియను ఈనెల 12 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషనరేట్‌ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా 12వ తేదీ నుంచి 17వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇస్తూ, 14 నుంచి 19వరకు వెబ్‌ఆప్షన్లు, 20న వెబ్‌ఆప్షన్ల మార్పుకు గడువు ఉంటుందని వెల్లడించింది. 23వ తేదీన మెరిట్‌ లిస్ట్‌ విడుదల, 24వ తేదీ నుంచి 27వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

డివైడర్‌ను ఢీకొన్న లారీ

తిరుపతి రూరల్‌ : చిత్తూరు– పీలేరు జాతీయ రహదారిపై పాకాల మండలం పదిపుట్లబైలు వద్ద అదుపుతప్పిన లారీ డివైడర్‌ను ఢీకొని మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానప్పటికీ లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. పోలీసుల సమాచారం మేరకు.. వరి పొట్టు, ఇసుక లోడుతో లారీకి బ్రేకులు పనిచేయకపోవడంతో అదుపు తప్పింది. రహదారి మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో లారీ ఇంజన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనదారు లు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డ్రైవర్‌పై దాడి

తిరుపతి క్రైం : అపార్ట్‌మెంట్‌లో కారు పార్కింగ్‌ విషయంలో తలెత్తిన వివాదం డ్రైవర్‌పై దాడికి దారి తీసిన సంఘటన ఆదివారం రాత్రి తిరుపతిలోని కోరమేనుగుంటలో ఉన్న జీపీఆర్‌ రెసిడెన్సీలో చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న అమిత్‌కుమార్‌ శర్మ వద్ద డేరంగుల తేజ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పల్లవి, దిలీప్‌ దంపతులు కారు పార్కింగ్‌ విషయమై తేజతో గొడవకు దిగినట్లు సమాచారం. మాటమాట పెరగడంతో ఇద్దరూ కలిసి తేజపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుపతి ఈస్ట్‌ సీఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

అలరించిన పౌరాణిక,

సాంఘిక నాటికలు

తిరుపతి కల్చరల్‌: మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటక పోటీలు ఆదివారం ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన పౌరాణిక పద్యనాటకాలు, సాంఘిక నాటికలు ఆకట్టుకున్నాయి. ఉదయం విజయవాడ డాక్టర్‌ రామన్‌ ఫౌండేషన్‌ వారు ప్రదర్శించిన కృష్ణవేణి మాత, ఖడ్గతిక్కన పద్యనాటకాలు, కాట్రపాడు ఉషోదయ కళా నికేతన్‌ వారి మంచి మనసులు సాంఘిక నాటిక అలరించాయి. ఆంధ్ర మహావిష్ణువు బాలల పద్యనాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులను ఎస్వీ నాట్య కళా పరిషత్‌ అధ్యక్ష, కార్యదర్శులు మర్దం గజేంద్ర, కొత్తపల్లి మునిరత్నం పారితోషకం, జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement