తిరుపతి అన్నమయ్యసర్కిల్:ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యతోనే ఉన్నత స్థానం అందుకోగలరని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్ కమిటీ ఆద్వర్యంలో చేపట్టిన జర్నలిస్టుల పిల్లల ప్రతిభా పురస్కార ప్రధానోత్సవ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ లక్ష్యం నిర్దేశించుకుని ఆదిశగా విద్యార్థులు ముందుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులకు పేరు, ప్రతిష్టలు తీసుకువచ్చేలా సత్ప్రవర్తనతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మురళి, బాలచంద్ర మాట్లాడుతూ విద్యార్థులను మరింతగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ప్రతిభా పురస్కారాలు అందజేసినట్లు చెప్పారు. మొబైల్ ఫోన్లు, టెలివిజన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ విద్యార్థులు చక్కగా చదువుకోవాలని కోరారు. ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీలు జగదీష్, విజయ్ యాదవ్, ఈసీ మెంబర్లు నాగార్జున, కోటి, బాలయ్య పాల్గొన్నారు.


