విశ్వంలో నేడు ఉచిత శిక్షణ
తిరుపతి అర్బన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027– 28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల సమర్పణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారని తిరుపతి విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్ర అధినేత విశ్వనాఽథ్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఈ క్రమంలోనే విశ్వం విద్యా సంస్థల ఆధ్వర్యంలో నవోదయ 2027 ప్రవేశ పరీక్షకు శనివారం ఉచిత నమూనా టెస్ట్‌తోపాటు అవగాహన సదస్సును వరదరాజనగర్‌లోని విశ్వం స్కూల్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు అర్హత, దరఖాస్తు విధానం, పరీక్ష పద్ధతి, సిలబస్, ప్రశ్నల సరళి, ముఖ్యమైన తేదీలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. గత ఏడాది విశ్వంలో శిక్షణ తీసుకున్న 72 మంది విద్యార్థులు నవోదయలో సీట్లు పొందారని చెప్పారు. ఇతర వివరాలకు 8688888802, 9399976999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
10న హెచ్‌సీఎల్ డ్రైవ్
తిరుపతి అర్బన్ : ఇంటర్మీడియట్ 2025–26లో ఉత్తీర్ణులై 75శాతం మార్కులు వచ్చిన నాన్–మ్యాథ్స్ గ్రూప్ విద్యార్థులకు ఈ నెల 10వ తేదీన హెచ్‌సీఎల్–టెక్‌లో అసోషియేట్ హోదాలో అవకాశం కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం, ఆర్‌ఐఓ గోపాల్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఈసీ, హెచ్‌ఈసీ, బైపీసీతోపాటు ఓకేషన్ విద్యార్థులు ఈ ఏడాది 75శాతం మార్కులు సాధించిన ఉంటే అర్హులని పేర్కొన్నారు. కరకంబాడి సమీపంలోని శ్రీరామ ఇంజినీరింగ్‌లో హెచ్‌సీఎల్ టెక్ వారు నిర్వహించే ఇంటర్వ్యూలకు హజరుకావాలని కోరారు. ఆసక్తిగలవారు హెస్‌సీఎల్‌టీఈసీహెచ్‌బీఈఈ కమ్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 8019913422 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
పట్టపగలే చోరీ
దొరవారిసత్రం : మండలంలోని కొత్తపల్లెలో పారిచెర్ల రాజేంద్ర అనే వ్యక్తి ఇంట్లో గురువారం పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రాజేంద్ర దంపతులు బేల్దారి పని నిమిత్తం ఇంటికి తాళం వేసుకుని వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి వచ్చే సరికి చోరీ జరిగింది. దుండగులు బీరువాను పగులగొట్టి రూ.15వేల నగదు, బంగారు కమ్మలు, వెండి పట్టీలు అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రేణిగుంట : మండలంలోని మామండూరు సమీపంలో శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి (సుమారు 50ఏళ్లు) మృతి చెందినట్లు రేణిగుంట పోలీసులు తెలిపారు. మృతుడి ముఖం నుజ్జు కావడంతో గుర్తుపట్టలేని విధంగా తయారైందని వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
పరారీలోని నిందితుడి అరెస్ట్
రేణిగుంట : డ్రగ్స్ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ఏ–4 నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర తెలిపారు. వివరాలు.. ఈ కేసులో ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగో నిందితురైన పూతలపట్టు మండలానికి చెందిన గొడుగు చింత వినోద్ కుమార్ శుక్రవారం ఉదయం రమణ విలాస్ సర్కిల్‌లో పట్టుబడ్డాడు. నైజీరియాకు చెందిన వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


