– కేంద్ర మంత్రిని కలిసిన తిరుపతి ఎంపీ
నాయుడుపేట టౌన్: తిరుపతి, నెల్లూరు జిల్లాల పరిధిలో నెలకొన్న గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు బుధవారం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువాల్ ఓ రామ్‌ను ఢీల్లిలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీతో పాటు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అర్గనైజింగ్ సెక్రటరి కామిరెడ్డి రాజారెడ్డి మరికొంత మంది నాయకులతో వెళ్లి కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ట్రైబల్‌కు సంబంధించి అనేక సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు రాజారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఎంపీ పలు శాఖల కేంద్ర మంత్రులను కలిసి స్థానిక 71వ నంబరు జాతీయ రహదారి నిర్మాణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలకు సర్వీసు రోడ్డుతో అనుసంధానం చేయాలని సూచించినట్టు తెలిపారు. ఎంపీ చర్యలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
మాతృమరణాలపై సమగ్ర విచారణ
తిరుపతి అర్బన్: మాతృ మరణాలపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మాతృ మరణాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల పెళ్లకూరు, తిరుపతిలోని ఎంఆర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రెండు మాతృ మరణాలు జరిగిన విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీరో ఐఎంఆర్–జీరో ఎంఎంఆర్ కార్యక్రమాన్ని పైలెట్ ప్రోగ్రామ్‌లో భాగంగా వెంకటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని చెప్పారు. ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంఅండ్‌హెచ్‌వో బాలకృష్ణనాయక్, డీసీహెచ్‌ఎస్ ఆనందమూర్తి, డీఐఓ డాక్టర్ శాంచకుమారి పాల్గొన్నారు.
తొలి రోజు.. తడబడి!
–డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు పరుగులు
తిరుపతి సిటీ: జిల్లాలో డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు బుధవారం ఓఏఎమ్‌డీసీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ల కోసం నెట్ సెంటర్లకు పోటెత్తారు. కాగా తొలి రోజు సర్వర్ సమస్య కొంత సేపు మొరాయించినా తర్వాత సహకరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు తడబడాల్సి వచ్చింది. కొన్ని కాలమ్స్ అర్థంగాకపోవడం అవసరమైన ధృవపత్రాలను అందబాటులో ఉంచుకోకపోవడంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
టీటీడీ కళాశాలల్లో హెల్ప్ సెంటర్లు
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, ఎస్‌జీఎస్, పద్మావతి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగ విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం పెద్ద సంఖ్యలో కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డస్క్‌లను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తిరుపతి నగరంలో బుధవారం సుమారు 700 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం.


