విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాణించాలి
రామచంద్రాపురం: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువులో రాణించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం రామచంద్రాపురం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కట్టకింద వెంకటాపురాన్ని సందర్శించిన ఆయన పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. ప్రతి రోజూ పాఠశాలలో బోధించిన పాఠాలను అదే రోజు పునఃశ్చరణ చేయాలని, క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా పాఠ్యాంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలను అడిగి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. విద్యార్థులు ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు.
శ్మశానానికి దారి లేకపోవడంతో పంట పొలాల మీదుగా శవయాత్ర జరిగిన ఘటన ఏర్పేడు మండలం, మాధవమాలలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుబ్బమ్మ(65) అనారోగ్యంతో మృతి చెందడంతో బుధవారం ఆమె పార్ధివ దేహానికి అంతిమ క్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి తీసుకెళ్లారు. అయితే గ్రామ శ్మశానానికి దారి లేకపోవడంతో పంట పొలాల గుండా ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లారు. రెవెన్యూ అధికారులు స్పందించి శ్మశానానికి దారి చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. – ఏర్పేడు


