పుల్లంపేట: మండల పరిధిలోని సీతారాంపేట గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. గ్రామానికి చెందిన గుత్తికొండ కుమార్‌రాజా(40) బుధవారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మహిళను వేధించిన
వ్యక్తిపై కేసు
తిరుపతి : మహిళను వేధించి, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై అలిపిరి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. కడప జిల్లాకు చెందిన జి.నిఖిల్ అనే వ్యక్తిపై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధితురాలు తిరుపతిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తుండగా, అదే పాఠశాలకు నృత్య శిక్షణ ఇచ్చేందుకు వచ్చే నిఖిల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు ఆమెతో ఫొటోలు దిగిన అనంతరం పదేపదే ఫోన్ చేసి మాట్లాడాలని ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, ఆ ఫొటోలను ఆమె భర్తకు చూపించి పరువు తీస్తానంటూ బెదిరించినట్లు ఆరోపించారు. ఈ నెల 3వ తేదీన నిందితుడిని అతని ఇంటి వద్ద నిలదీయగా, ఆమె జుట్టు పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లి చేతులతో దాడి చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించి, ప్రాణహాని కలిగిస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకుని బాధితురాలిని రక్షించినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అలిపిరి పోలీస్ స్టేషన్‌న్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


