భాకరాపేట: చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ వెంట వచ్చిన వ్యక్తి చికిత్స చేయడం లేదని డ్యూటీ డాక్టర్‌ని ప్రశ్నించగా సదురు డాక్టర్ వాగ్వాదానికి దిగిన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆస్పత్రి వర్గాల వివరాల ప్రకారం.. రొంపిచర్ల క్రాస్‌కు చెందిన లోకమ్మ (40) మంగళవారం సాయంత్రం చిన్నగొట్టిగల్లు ఆస్పత్రికి వెళ్లింది. ఆమెతోపాటు బంధువు నాగరాజు వచ్చాడు. మందుల వివరాలు డాక్టర్ అడుగుతున్న సమయంలో అతను ఆగ్రహానికి లోనయ్యాడు. డాక్టర్‌తో దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఇరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. ఘటనపై మెడికల్ ఆఫీసర్ స్పందిస్తూ, ప్రాథమిక విచారణలో రోగి వెంట వచ్చిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసిందన్నారు. బుధవారం డీసీహెచ్‌ఎస్ సమక్షంలో పూర్తి స్థాయి విచారణ నిర్వహించి, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


