నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా పరిధిలోని నాయుడుపేట, తూర్పు కనుపూరు తదితర ప్రాంతాల పరిధిలో ఉన్న 71వ జాతీయ రహదారిపై పలు గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వీస్ రోడ్డు నిర్మించలేని, వెంటనే ఆయా గ్రామాలకు సర్వీసు రోడ్డు నిర్మించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ సంతోష్‌కుమార్ యాదవ్‌ను కోరారు. ఈ సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలోని చైర్మన్ కార్యాలయంలో ఎంపీతో పాటు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి, త్రిలోక్ చంద్రారెడ్డితో కలిసి చైర్మన్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ చైర్మన్‌తో పలు విషయాలపై చర్చించినట్లు వెల్లడించారు. నాయుడుపేట మున్సిపాలిటీ భివృద్ధి చెందుతూ ముఖ్యకూడలి పట్టణంగా మారుతోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో యాక్సెస్ కంట్రోల్ విధానంతో నిర్మించిన ఎన్‌హెచ్ 71నకు పూర్తి స్థాయిలో సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా అత్యవసర సేవల రాకపోకలపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతోందన్నారు. నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు జంక్షన్ నుంచి అన్నమేడు వరకు, గోమతి సెంటర్ నుంచి నాయుడుపేట పట్టణం వరకు చాలాచోట్ల రహదారికి సర్వీస్‌రోడ్లు పూర్తి స్థాయిలో లేవన్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత శాఖల అధికారులకు సైతం ప్రత్యక్షంగా రహదారుల వద్దకు తీసుకువెళ్లి చూపించినట్లు చైర్మన్‌కు వివరించినట్లు తెలిపారు. అనంతరం చైర్మన్‌కు ఓ వినతిపత్రాన్ని అందించారు.


