● వ్యక్తికి తీవ్ర గాయాలు
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి, వకుళామాత ఆలయ సమీపంలోని ఒమేగా ఆస్పత్రి మలుపు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చంద్రగిరి మండలం, పిచ్చినాయుడుపల్లికి చెందిన గిరి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని తొలుత తిరుపతి రుయా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనపై తిరుపతి రూరల్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
తిరుపతి యువకుడిపై తెలంగాణలో కేసు
మేడిపల్లి (తెలంగాణా): తిరుపతికి చెందిన యువకుడు ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయమైన వివాహితను వేధింపులకు గురిచేయడంతో ఆ యువకుడిపై తెలంగాణ రాష్ట్రం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరారెడ్డినగర్ కాలనీకి చెందిన మహిళకు 2025 డిసెంబర్‌లో తిరుపతికి చెందిన చరణ్ అనే వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయమయ్యాడు. మేకప్ ఆర్డర్లు ఇప్పిస్తానని చెప్పి ఆమె మొబైల్ నంబర్ తీసుకుని తరుచూ ఫొన్‌లో మాట్లాడేవాడు. ఈ ఏడాది ఎప్రిల్‌లో చరణ్ హైదరాబాద్‌కు వచ్చి చెంగిచెర్లలోని ఓ రెస్టారెంట్‌లో ఆమెను కలిశాడు. అనంతరం ఆమెకు తరచూ ఫోన్‌చేసి సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు. ఆమె నిరాకరించడంతో తన వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్‌లు బంధువులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించేవాడు. వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి ఫోన్‌చేసి ఇబ్బందులకు గురిచేసేవాడు. అదేవిధంగా ఆమె వద్ద నుంచి రూ.50వేల చొప్పున రెండుసార్లు నగదు తీసుకున్నాడు. ఒకసారి తిరిగి ఇచ్చేశాడు. మరోసారి 50వేలు చెల్లించకుండా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదచేశారు. ఆమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.


