వరదయ్యపాళెం: స్నేహితులతో కలిసి ఒక రోజు సరదాగా గడపాలన్న ఆలోచన... కానీ ఆ సరదా కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా, బైరిసింగివనం గ్రామానికి చెందిన యువకుడు ఈగల సురేష్ (20) స్నేహితుల దినోత్సవం రోజు ప్రమాదవశాత్తు బావిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.
రెండేళ్లుగా సూళ్లూరుపేటలో..
రెండేళ్లుగా సురేష్ సూళ్లూరుపేటలోని పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అమెజాన్‌న్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. ఇటీవల ఊరి నుంచి వచ్చిన తర్వాత ప్రస్తుతం పనిలో లేడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని అనుకున్నాడు. వరదయ్యపాళెం మండలం, చిన్నపాండూరు సమీపంలోని అపోలో టైర్స్ పరిశ్రమ వెనుక వ్యవసాయ భూముల్లో ఉన్న ఒక బావి వద్దకు ఐదుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. అందరూ బావిలోకి దిగి నీటిలో సరదాగా ఈతాడారు. సాయంత్రం వరకు అంతా బాగానే ఉంది. కానీ సురేష్ నీటిలోకి మునిగిన తర్వాత చాలాసేపటికి కూడా పైకి రాలేదు. స్నేహితులు ఎంత వెదికినా ఆచూకీ కనిపించ లేదు. ఆందోళన చెందిన స్నేహితులు వెంటనే శ్రీసిటీ పోలీస్ స్టేషన్‌్ లో ఫిర్యాదు చేశారు. అయితే చీకటి అవ్వడంతో ఆ రాత్రి ఏమీ చేయలేకపోయారు. సోమవారం తెల్లవారుజామున అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు బావిలోకి దిగి గాలింపు చేపట్టారు. కొద్దిసేపటికి సురేష్ మృతదేహం బావిలో లభించింది. శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని అప్పగించినట్లు శ్రీసీటీ ఎస్‌ఐ ప్రియాంక తెలిపారు.
విషాదంలో కుటుంబం
ఇంటికి ఆధారంగా ఉండాల్సిన కొడుకు ఇలా విగతజీవిగా తిరిగి రావడంతో బైరిసింగివనంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ‘స్నేహితుల దినోత్సవం రోజు సరదాగా వెళ్తానని చెప్పి వెళ్లాడు. ఇలా జరుగుతుందని అనుకోలేదు‘ అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇది ప్రమాదవశాత్తు మునిగిపోవడమేనా.. లేక మరేదైనా కారణముందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రియాంక వెల్లడించారు.


