ఏర్పేడు: రాష్ట్రంలో సౌర ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తిరుపతి ఐఐటీ, ఆస్ట్రేలియా సిడ్నీ యూఎన్‌ఎస్ డబ్ల్యూ, కోఈఈటీలతో అమరావతిలో జరిగిన ఓ సదస్సులో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో తిరుపతి ఐఐటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (యూఎన్‌ఎస్‌డబ్ల్యూ), విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (కోఈఈటీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సౌర ఫోటోవోల్టాయిక్ ఉత్పాదక రంగం, రీసైక్లింగ్, విద్య, కార్మిక శక్తి అభివృద్ధి, పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మూడు సంస్థలు సమష్టిగా కలసి పని చేస్తాయని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల సహకారంతో సోలార్ సెల్ తయారీ, విశ్వసనీయత ఇంజనీరింగ్‌లో తన పరిశోధనా నైపుణ్యాన్ని అందిస్తుందన్నారు. తిరుపతి ఐఐటీ ఈ కేంద్రాన్ని స్థాపించడానికి విద్యా మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పరిశోధన సహకారాన్ని అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీఎస్‌పీ డీసీఎల్ ఈఈటీ చీఫ్ జీఎం డీ.సుమన్ కళ్యాణి, సిడ్నీ యూనివర్శిటీ ప్రో వైస్–చాన్స్‌లర్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ లిజా జాంబర్లాన్, ఐఐటీ డీన్ ప్రొఫెసర్ అరుణ్ కె.తంగిరాల పాల్గొన్నారు.
యువకుడిపై కత్తులతో దాడి
– చికిత్స పొందుతూ మృతి
శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తిలో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేయడం కలకలం రేపింది. వివరాలు.. పట్టణంలోని స్వర్ణముఖి కరకట్ట మీద కొండమిట్ట ప్రాంతానికి చెందిన శివ(34) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన శివను స్థానిక ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శివ మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై శ్రీకాళహస్తి ఒకటో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు స్పందిస్తూ, హత్యకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామన్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనకు గల కారణాలు, దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు.


