తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమో కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం 5వ తేదీన స్పాట్ అడ్మిషన్లు చేస్తున్నట్టు సాంకేతిక విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో నిర్వహించిన పాలిసెట్ రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. ఇందులో భాగంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురు చూసే విద్యార్థులు ఈ నెల 4వ తేదీలోపు స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకుని 5న స్పాట్ అడ్మిషన్లకు ఓరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించింది. మరిన్ని వివరాలకు ఆయా పాలిటెక్నిక్ కళాశాలల కార్యాలయాల్లో సంప్రదించాలని పేర్కొంది.
కలెక్టరేట్‌లో నేడు పీజీఆర్‌ఎస్
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని విభాగాలకు చెందిన అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అలాగే మీ మండల, డివిజన్ పరిధిలోని సోమవారం పీజీఆర్‌ఎస్ ఉంటుందని వెల్లడించారు.
నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగ దారులు మొబైల్ నం.8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు.
ఇనుము పైపు పడి
కార్మికుడి మృతి
శ్రీకాళహస్తి రూరల్: ఇనుము పైపు పడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని రాచగున్నేరి సమీపంలోని ల్యాంకో కర్మాగారంలో శనివారం చోటు చేసుకుంది. రూరల్ సీఐ ఇబ్రహీం కథనం.. జార్ఖండ్‌కు చెందిన అల్తాబ్ బన్సారి (20) శనివారం క్రేన్‌కు పైపును కడుతుండగా అదుపుతప్పి పైపు అతనిపై పడింది. తీవ్రంగా గాయపడిన అల్తాబ్‌ను శ్రీకాళహస్తి ఏరియా ఆసస్పత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బన్సారి మృతిచెందాడు. కేసు విచారణలో ఉంది.
కంటైనర్ లారీ ఢీ
– డ్రైవర్ మృతి
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి మార్గం, చిల్లకూరు గ్రామం వద్ద ఆదివారం ముందు వెళుతున్న గుర్తుతెలియని వాహనాన్ని కంటైనర్ లారీ ఢీకొనడంతో డ్రైవర్ అరూల్(30) తీవ్ర గాయాలై మృతి చెందాడు. పోలీసుల సమాచారం.. కడపలో స్పేర్ పార్ట్స్ అన్‌లోడ్ చేసిన కంటైనర్ డ్రైవర్ అరూల్ తిరిగి చైన్నెకి వెళుతున్నాడు. మార్గ మధ్యంలో చిల్లకూరు గ్రామం వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పై ముందు వెళుతున్న వాహాన్ని అదిగమించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు దాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన కంటైనర్ లారీ డ్రైవర్ అరూల్‌ను చికిత్సలు నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సలు పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.


