రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Aug 3 2026 4:09 AM | Updated on Aug 3 2026 4:09 AM

కేవీబీపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం కేవీబీపురం మండలంలో చోటుచేసుకుంది. ఏర్పేడు మండలం, పెనుమల్లం గ్రామానికి చెందిన పెమ్ముగారి సెల్వ కుమార్‌ (50) కేవీబీపురం మండలం, ఆదవరం గ్రామంలోని అక్క పార్వతమ్మ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి ద్విచక్ర వాహనంలో హాజరై తిరుగు ప్రయాణమయ్యాడు. ద్విచక్ర వాహనంలో వెళుతుండగా శ్రీకాళహస్తి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు గుంటమెట్టు వద్ద ఢీకొట్టింది. సెల్వకుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108లో అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కొత్తకండ్రిగ వద్ద మృతిచెందాడు. మృతునికి భార్య కృష్ణవేణి, కుమారుడు భరత్‌కుమార్‌ ఉన్నారు. సెంట్రింగ్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సెల్వకుమార్‌ అకాల మరణంతో కుటుంబం వీధిన పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఓబయ్య తెలిపారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా చెస్‌ పోటీలు ప్రారంభం

నగరి : స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు నగరి చెస్‌ అసోసియేషన్‌ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వీకేఆర్‌ పురం గ్రాండ్‌ వరల్డ్‌లో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి చెస్‌ టోర్నమెంట్‌ ప్రారంభించారు. జూనియర్‌ విభాగంలో 140 మంది, సీనియర్‌ విభాగంలో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లయన్స్‌ క్లబ్‌ రీజినల్‌ చైర్‌పర్సన్‌ ప్రభాకర్‌ రాజు, పెన్షనర్స్‌ సంఘం గౌరవ అధ్యక్షుడు ఓ.బాలసుబ్రమణ్యం చెస్‌ ఆడి పోటీలను ప్రారంభించారు. ప్రభాకర్‌రాజు మాట్లాడుతూ పూర్వం రాజులు యుద్ధంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు అనుసరించిన విధానాలతో పుట్టుకొచ్చిందే చదరంగమన్నారు. అది క్రీడగా మారి విశ్వవ్యాప్తమైందన్నారు. ఈ క్రీడతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని, విజ్ఞానాన్ని పెంచుతుందన్నారు. ఓ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ 29 యేళ్ల క్రితం స్నేహితుల దినోత్సవం రోజు ఈ పోటీలను నగరిలో ప్రారంభించినట్టు తెలిపారు. నేడు అదే స్నేహితుల దినోత్సవం రోజున పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు గజేంద్ర మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ ఫైనల్స్‌ జరుగుతాయని, విజేతలకు బహమతులు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో చదరంగ నిపుణులు నవీన్‌కుమార్‌, ఆదికేశవులు, హర్ష నగరి లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి కిషోర్‌కుమార్‌, కోశాధికారి శక్తివేలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement