మా అమ్మాయిని చంపేశారు! | - | Sakshi
Sakshi News home page

మా అమ్మాయిని చంపేశారు!

Aug 2 2026 1:58 AM | Updated on Aug 2 2026 1:58 AM

● సోషల్‌ టీచర్‌పై అనుమానాలు ● బాలిక ఆత్మహత్యపై తల్లిదడ్రుల ఫిర్యాదు

నారాయణవనం: ‘సోషల్‌ టీచర్‌ మునివేలు నమ్మించాడు. నా కూతురుకి మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్పుకొచ్చాడు. పేరున్న ఇంజినీరింగ్‌ కాలేజీలో సీటు తీసిస్తానని తిప్పించాడు. తీరా ఎక్కడా సీటు లేకుండా చేశాడు. అప్పటి నుంచి నా కుమార్తే కుంగిపోయింది. చివరకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది...’ అంటూ బాలిక తల్లి బోరున విలపించడం గుండెల్ని పిండేసింది. పోలీసుల కథనం.. నారాయణవనం బీసీ కాలనీకి చెందిన మరమగ్గ కార్మికులు గోపి, హంస దంపతులకు జీవ(17) కుమార్తె ఉంది. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో తమిళ మీడియంలో జీవ 10వ తరగతి చదువుతున్నపుడు సోషల్‌ మునివేలు బదిలీపై వచ్చాడు. పదిలో జీవ మంచి మార్కులతో పాసయ్యింది. ఆ తర్వాత పుత్తూరులోని ఓ ప్రయివేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేసింది. ఇటీవలే ఎంసెట్‌ రాసి ఇంజినీరింగ్‌కు అర్హత సాధించింది. బీటెక్‌లో మంచి పేరున్న కళాశాలలో చేర్పిస్తానని సోషల్‌ టీచర్‌ నమ్మించాడు. ఇంజినీరింగ్‌ తానే చదివిస్తానని ఆశ పెట్టాడు. ఆ తర్వాత తిరుపతి, చిత్తూరుకు జీవను తీసుకువెళ్లేవాడు.

డైట్‌లో సీటు తీసిస్తానని..

కార్వేటినగరం డైట్‌ కళాశాలలో సీటు కోసం మాట్లాడానని మునివేలు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో జీవ జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం కార్వేటినగరానికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చింది. అక్కడ ఏం జరిగిందో ఏమో.. అప్పటి నుంచి అన్నం తినడం మానేసింది. ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనం వహిచింది. చివరకు గురువారం సాయంత్రం మిద్దైపె ఫ్యానుకు ఉరివేసుకుని తనువు చాలించినట్టు మృతురాలి తల్లి కన్నీరుమున్నీరవుతోంది. కాగా బాలికకు శుక్రవారం అంత్యక్రియలు పూర్తి చేశారు.

వ్యవహారాన్ని బయటపెట్టిన స్మార్ట్‌ ఫోన్‌

శనివారం జీవ ఫోన్‌ను కుటుంబ సభ్యులు పరిశీలించారు. మునివేలు చాటింగ్‌, వీడియోకాల్స్‌ బయటపడ్డాయి. కొన్ని అసభ్యకర మెసేజ్‌లూ కనిపించాయి. దీంతో సోషల్‌ టీచర్‌పై అనుమానాలు పెంచుకున్నారు. గురువే తమ కుమార్తె మృతికి కారణమన్న వాస్తవాన్ని బాలిక కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఇదిలావుండగా మునివేలు స్థానిక సౌత్‌ తమిళ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తుండగా.. శనివారం పాఠశాలకు హాజరు కాలేదు. అనారోగ్య కారణంతో సెలవు పెట్టారని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. తల్లి హంస ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గిరిబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement