తిరుపతి తుడా: చైన్నె అపోలో ఆస్పత్రిలో శరీరంపై ఎటువంటి కోత లేకుండా సరికొత్త కార్డియాక్ సర్జరీ చేస్తున్నట్లు ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ధీరజ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం స్థానిక తుడా రోడ్డులోని అపోలో ఇన్‌ఫర్మేషన్ క్లినిక్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండె శాస్త్ర చికిత్సలో అందరికీ కలిగే భయం ఛాతి మధ్య భాగంలో కోత వేయడం వల్ల భారీ మచ్చ ఏర్పడి యద భాగంలో అసహ్యంగా ఉంటుందనే అపోహ ఉంటుందన్నారు. అయితే ఛాతి మధ్య భాగంలో కోత వేయకుండా శస్త్ర చికిత్స చేయడం అనే నూతన వైద్య విధానం అపోలో ఆస్పత్రిలో అందుబాటులో ఉందన్నారు. దీనికోసం రోబోటిక్ సహాయంతో లేదా తోరాకోస్కోప్ కెమెరాను ఉపయోగించి ఛాతికి ఎడమ లేదా కుడి వైపున రెండు నుంచి మూడు అంగుళాల చిన్న సర్జరీ చేయనున్నట్టు చెప్పారు. రోగులు సర్జరీ జరిగిన రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. కార్డియాక్ సమస్యలు ఉన్న ప్రజలు అపోలో సమాచార కేంద్రాన్ని సంప్రదించి ఈ సదుపాయాన్ని పొందాలని కోరారు.


