తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీలో అపచారాలు చేస్తూ భ్రష్టుపట్టిస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతీపురంలోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల నడక మార్గంలోని క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని దొంగలించింది టీడీపీ నాయకుడే అందరికీ తెలుసన్నారు. తన పార్టీకి చెందిన టీడీపీ నాయకుడిని కాపాడుకోవడం, పార్టీపై మచ్చపడకుండా ఉండేందుకు ఆంజనేయస్వామి విగ్రహం 2000 సంవత్సరంలో ఒక భక్తుడు తీసుకొచ్చి పెట్టారని, పెద్ద ప్రాధాన్యం లేదనట్టుగా చంద్రబాబు, టీటీడీ పాలకులు, పోలీసులు చెప్పడం చూస్తుంటే తిరుమల పవిత్రను ఏ విధంగా దిగజారుస్తున్నారో అర్థమవుతోందన్నారు. అది కూడా ఆంజనేయస్వామి విగ్రహాన్ని దొంగలించిన టీడీపీ నాయకుడు మతి స్థిమితం లేకపోవడంతో విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు బుకాయించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే ఆంజనేయస్వామి విగ్రహం దొంగతనం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 1979 నుంచే అక్కడ టీటీడీ అధికారికంగా ఆంజనేయస్వామి జన్మ నక్షత్రం రోజున పూజలు చేస్తున్నట్లు చెప్పారు. మాజీ ఈవో పీవీకే. ప్రసాద్ పాలనలోనే తిరుమల నడక మార్గంలో పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. అయితే అక్కడున్న చిన్న ఆంజనేయస్వామి విగ్రహం గత 60 ఏళ్ల క్రితం నుంచే పూజలందుకుంటున్నట్లు చెప్పారు. కేవలం టీడీపీ నాయకుడిని కాపాడేందుకు కేసును నీరుగారుస్తూ ఆ ఆంజనేయస్వామికి పెద్ద చరిత్ర ఏమీ లేదన్నట్లుగా చిత్రీకరిస్తుండడం బాధాకరమన్నారు. టీడీపీ నాయకులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమాలో ఉన్నారని, పోలీసులను కీలు బొమ్మలు చేసి చంద్రబాబు ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ విజిలెన్స్ వైఫల్యం కారణంగానే తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో స్వామి వారి కిరీటం ఎత్తుకెళ్లిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.
టీటీడీని భ్రష్టుపట్టిస్తున్న టీడీపీ
Jul 31 2026 2:03 AM | Updated on Jul 31 2026 2:03 AM
● ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దొంగ టీడీపీ నాయకుడే
● అతన్ని కాపాడేందుకే మతిస్థిమితం లేక ఎత్తికెళ్లాడని బుకాయింపు
● తిరుమలలో టీటీడీ విజిలెన్స్ పూర్తి వైఫల్యం
● టీటీడీ మాజీ చైర్మన్
భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం
Advertisement


