కానిస్టేబుల్ నుంచి ఎస్‌హెచ్‌ఓల వరకు అదే దూకుడు లాఠీలతో చావబాది స్వామి భక్తిని చాటుకుంటున్న సిబ్బంది కోర్టులు మందలించినా..ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినా మారని తీరు ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతున్న వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు
తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు మాసాల క్రితం అమ్మవారి వాహన బేరర్లు, స్థానికులకు ట్రాఫిక్‌లో చిన్నపాటి తగాదా జరిగింది. దానికి రాజకీయ రంగు పులిమిన పోలీసులు ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీకి సానుభూతి పరులపై అక్రమ కేసులు బనాయించి చితకబాదారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జడ్జి ఆ సీఐని మందిలిస్తూ వైద్య పరీక్షలకు పంపించారు. అంతేకాకుండా పోలీసులు కొట్టినట్టు నిందితుల వాంగ్మూలం కింద రికార్డు కూడా చేశారు.
పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ ముద్దలపల్లిలో దళితులపై టీడీపీ నాయకులు భౌతిక దాడులకు దిగారు. అక్కడి సీఐ అడ్డుకోకపోగా బూటు కాలితో తన్నుతూ దాడులు చేశారని బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు, వారికి అండగాా నిలిచిన సీఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితుడు శ్రీనాథ్ పేర్కొన్నారు.
పాకాల మండలం పెద్దగోర్పాడు గ్రామానికి చెందిన 77 ఏళ్ల వృద్ధురాలు చిట్టెమ్మ ఇంటి గేట్లు విరిచిన సీఐ చిన్నగోవిందుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పాతపాళెం దశరాజన్ జూలై 1వ తేదీన క్రైం నంబర్ 104/2026 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయినప్పటికీ సదరు సీఐ అదే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండడం గమనార్హం.
ఇటీవల రిటైర్డ్ జడ్జి గుర్రప్పనాయుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబీకులను ఎమ్మెల్యే పులివర్తి నాని నీచ మాటలతో దుర్భాషలాడిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోలేదని ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లగా అదనపు ఎస్పీ రవిమనోహరాచారి అడ్డుకోవడం, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపైనే కేసులు పెట్టారు.
తాజాగా రామచంద్రాపురం మండలం రాయలచెరువుకు చెందిన సుబ్రమణ్యం మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తున్నట్టు ఫిర్యాదు వెళ్లడంతో పోలీసులు అతన్ని లాఠీలతో చావబాదారు. దెబ్బలు తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితులైన పోలీసులను తప్పించేందుకు టీడీపీ మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ రాజశేఖర్ రాజీయత్నాలు చేశారు. పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారి కేసు తారుమారుకు సహకరించినట్టు సమాచారం.
చంద్రగిరి నియోజకవర్గంలో ఖాకీ లాఠీ గతి తప్పుతోందా..? రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తున్నారా..? పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడా..? అన్న అనుమానాలు, భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా జరుగుతున్న వరుస సంఘటనలతో పోలీసులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్కన కోర్టుల్లో న్యాయాధికారుల హెచ్చరికలు.. ఎస్‌హెచ్‌ఓలపైనే ఎఫ్‌ఐఆర్‌ల నమోదు చేసినా వారిలో మార్పు రావడం లేదు. దీనికి జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారి అధికార పార్టీ నేతల ఆధీనంలోకి వెళ్లిపోవడమేనన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
పోలీసు వ్యవస్థపై ప్రజల్లో సన్నగిల్లుతున్న నమ్మకం
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తిరుచానూరు, తిరుపతి రూరల్, చంద్రగిరి, పాకాల, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగడం లేదన్న విమర్శలు సామన్య ప్రజలు, బాధితులు విమర్శిస్తున్నారు. అధికార తెలుగు దేశం నేతలకు తప్ప జనసేన, బీజేపీ నేతలను కూడా పోలీసులు లెక్క చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు చెప్పింది చేసుకుపోతున్నారు.
వరుస ఘటనలతో తీవ్ర చర్చ
ఆందోళనలకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసులు అనుసరిస్తున్న తీరుపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సామాన్యులపై తమ ప్రతాపం చూపించే పోలీసుల భరతం పడతామని, న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతామని చంద్రగిరి నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చంద్రగిరి, పాకాల, తిరుపతి రూరల్, తిరుచానూరు సీఐలపై ప్రయివేటు కేసులు ఫైల్ చేశారని, ఆ కేసులపై ఎఫ్‌ఐఆర్‌లు కట్టించేలా చూస్తామన్నారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం పోతున్నా జిల్లా పోలీసు అధికారుల్లో చలనం లేకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ గాడిలో పడేంత వరకు బాధితుల పక్షాన తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.


