తిరుపతి రైల్వే ఆస్పత్రిని అభివృద్ధి చేయాలి | - | Sakshi
Sakshi News home page

తిరుపతి రైల్వే ఆస్పత్రిని అభివృద్ధి చేయాలి

Jul 30 2026 5:18 AM | Updated on Jul 30 2026 5:18 AM

● లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర రైల్వే మంత్రి ● అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ గురుమూర్తి

తిరుపతి మంగళం : తిరుపతి రైల్వే సబ్‌ డివిజనల్‌ హాస్పిటల్‌ను అభివృద్ధి చేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్రాన్ని కోరారు. ఆయన బుధవారం లోక్‌సభలో మాట్లాడారు. రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తిరుపతి రైల్వే ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తిరుపతి రైల్వే సబ్‌ డివిజనల్‌ హాస్పిటల్‌లో ప్రస్తుతం అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ఉన్నారని తెలిపారు. ప్రాథమిక వైద్య సేవలు ఆసుపత్రిలోనే అందిస్తున్నామని, ద్వితీయ, తృతీయ స్థాయి చికిత్స అవసరమైన రోగులను ఎనిమిది ఎంపానెల్డ్‌ ప్రైవేట్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేసే అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వలేదు. మంత్రి సమాధానంపై ఎంపీ గురుమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పేర్కొన్న వివరాలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని, తిరుపతి రైల్వే ఆస్పత్రిలో కనీస మౌలిక సదుపాయాలు, తగిన వైద్య సిబ్బంది అందుబాటులో లేరని అన్నారు. రైల్వే ఉద్యోగులు పలుమార్లు తనను కలిసి ఆస్పత్రి సమస్యలను వివరించారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అనేక మంది రోగులను గుంతకల్‌ రైల్వే ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారని తెలిపారు. దీంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతూ వ్యయప్రయాసలు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి రైల్వే ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య విభాగాలు, ఆధునిక నిర్ధారణ పరికరాలు, తగిన సంఖ్యలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరారు. లేనిపక్షంలో తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఎంపీ మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement