
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చిల్లకూరు: మండలంలోని కమ్మవారిపాళెం సమీపంలోని చీమల తిప్ప వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గురువారం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహం కాలి పోయి గుర్తు పట్టలేని విధంగా ఉండడంతో పోలీసులు పలు కోణాలలో విచారణ చేపట్టగా మృతుడు కోట పట్టణంలోని నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి కాలనీకి చెందిన చర్లగుంట హరిప్రసాద్(43)గా గుర్తించారు. అతడు ఎందుకు ఈ ప్రాంతంలోకి వచ్చి మృతి చెందాడనే విషయం తెలియడం లేదని, మృతదేహం కాలిపోయి గుర్తు పట్టలేని విధంగా ఉండడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడా?, ఎవరైనా చంపి ఇక్కడకు తీసుకుని వచ్చి కాల్చి వేశారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.