
రోసనూరు కేంద్రానికి ఆయనే రేరాజు
మండలంలోని రోసనూరు గ్రామం కేంద్రంగా గత ఐదు దశాబ్దాలుగా ఓ రేరాజు చీకటి రాజ్యాన్ని ఏలుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ కండువా కప్పుకుని సామాన్య జనాన్ని మభ్యపెట్టి గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగిస్తూ ధనార్జనే లక్ష్యంగా దూసుకెళుతున్నారు. గ్రామానికి సమీపంలోని అటవీ భూములు, చెరువులు, తెలుగుగంగ పొర్లుకట్టలపై మట్టిని యంత్రాలతో తవ్వి, లారీలు, టిప్పర్లతో దొరవారిసత్రం, నాయుడుపేటలో లేఅవుట్లకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజుపాళెం, రోసనూరు, కృష్టప్పకండ్రిగ గ్రామాల్లో ఒక షాడో ప్రజాప్రతినిధిగా వ్యవహ రిస్తూ గ్రావెల్, మట్టి తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. అయినా అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. రాజుపాళెం చెరువుకట్ట అభివృద్ధి, జంగిల్ క్లియరెన్స్ పేరుతో కట్టపై ఉన్న రూ.లక్షలు విలువ చేసే చెట్లను నరికి, విక్రయించి సొమ్ము చేసుకున్నారు. తెలుగుగంగ కాలువ గట్టు, గ్రామ సమీపంలో ఉన్న ఫారెస్ట్ భూములు, గిరిజన కాలనీ సమీపంలోని చెరువు, దళిత కాలనీ దిగువ ప్రాంతంలో ఉన్న చెరువు, గ్రామ సమీపంలోని భూపతీశ్వర కొండ తదితర ప్రాంతాల్లో భారీ యంత్రాలతో మట్టి, గ్రావెల్ అక్రమంగా తవ్వి, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.