గఘన విజయం | - | Sakshi
Sakshi News home page

గఘన విజయం

Aug 22 2025 6:49 AM | Updated on Aug 22 2025 6:49 AM

గఘన వ

గఘన విజయం

తూర్పు తీరాన శ్రీహరికోటలో

రాకెట్‌ ప్రయోగ కేంద్రం

ఆరు రకాల రాకెట్ల రూపకల్పన

102 ప్రయోగాలు

92 ప్రయోగాలు సక్సెస్‌

23న జాతీయ అంతరిక్ష దినోత్సవం

శ్రీహరికోటలో ఒకేసారి నాలుగు రాకెట్‌లను అనుసంధానం చేసుకునేలా నాలుగు వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లు, రెండు ప్రయోగవేదికలు ఉన్నా యి. సంవత్సరానికి 12 ప్రయోగాలు చేసుకునే అత్యంత అధునాత సాంకేతిక పరిజ్ఞానం ఉంది.

రూ.300 కోట్లు వ్యయం చేసి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండో ప్రయోగవేదికను నిర్మించారు. 2005 మే5న ఈ ప్రయోగవేదికను అప్పటి ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్‌ చేతులు మీదుగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

రాకెట్‌ ప్రయోగాల్లో కీలకపాత్ర పోషించే ఘన ఇంధన విభాగాన్ని ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు. శ్రీహరికోటలోని ఘన ఇంధనప్లాంటు ప్రపంచంలోనే అతి పెద్దది. ఒకేసారి పది రాకెట్‌ ప్రయోగాలకు సరిపడేలా ఘన ఇంధన సెగ్మెంట్లు తయారు చేసుకునే సామర్థ్యంతో నిర్మించారు. రాకెట్‌ ప్రయోగాల్లో రెండు, నాలుగు దశలో వినియోగించే ఘన ఇంధన దశలతో పాటు ఘన ఇంధన స్ట్రాపాన్‌ బూస్టర్లును కూడా తయారు చేసే విభాగం విషయంలో ఇస్రో ఎంతో పరిణితిని సాధించింది.

రూ.20 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిషన్‌ కంట్రోల్‌రూమ్‌ నిర్మించి 2012 జనవరి 02న అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతులు మీదుగా దీన్ని ప్రారంభం చేసి జాతికి అంకితం చేశారు. ఈ మిషన్‌కంట్రోల్‌రూమ్‌ను ఆదిత్య–369 సినిమాల్లో టైమ్‌ మిషన్‌ డిజైన్‌లా ఈ భవనాన్ని నిర్మించారు.

రూ.245 కోట్లు వ్యయంతో మల్టీ అబ్జెక్టివ్‌ ట్రాకింగ్‌ రాడార్‌ కేంద్రాన్ని నిర్మించారు. ఒకే సారి పది రాకెట్లను ట్రాకింగ్‌ చేసే సామర్థ్యం కలిగిన ఎంఓటీఆర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచంలో ఎంఓటీఆర్‌ ఉన్న రెండోదేశంగా ఇస్రో ఆవిర్భవించింది.

రూ.628.95 కోట్లు వ్యయంతో ఒకే సారి రెండు రాకెట్లును అనుసంధానం చేసేందుకు రెండో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ (వ్యాబ్‌) నిర్మించగా దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌ విధానంలో జాతికి అంకితం చేశారు.

ఆర్‌ఎల్‌వీ–టీడీ ప్రయోగాత్మక ప్రయోగం సక్సెస్‌ అయినందున షార్‌లో స్పేస్‌ షటిల్‌ ప్రోగ్రామ్‌కు కూడా సన్నాహాలు చేస్తున్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే వ్యోమనౌకను ప్రయోగాత్మకంగా చేసి విజయం సాధించడంతో షార్‌లో మూడో ప్రయోగవేదికను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగవేదిక నుంచే రాబోయే పదేళ్లలో స్పేస్‌షటిల్‌ ప్రోగ్రాంలో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు గగన్‌యాన్‌ పేరుతో పలు ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు.

షార్‌లో ఒకేసారి పది రాకెట్‌లను ట్రాకింగ్‌ చేయగలిగిన సామర్థ్యంతో నిర్మించిన మల్టీ అబ్జెక్టి ట్రాకింగ్‌ రాడార్‌ కేంద్రం

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో శ్లాఘనీయమైన విజయాలు సాధించింది. నాటి ఆర్యభట్ట నుంచి నేటి గగన్‌యాన్‌ వరకు అంతరిక్షయాత్ర నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఇస్రో సొంతంగా 102 ప్రయోగాలను చేసి ఎన్నో మైలురాళ్లును అధిగమించింది. 2008లో చంద్రయాన్‌–1, 2013లో మంగళ్‌యాన్‌– 1, 2019లో చంద్రయాన్‌–3, 2023లో చంద్రయాన్‌–3, సూర్యయాన్‌–1 పేర్లతో ఐదు గ్రహాంతర ప్రయోగాలు, ఈ ఏడాది గగన్‌యాన్‌ ప్రయోగానికి సిద్ధమవుతోంది. 1963 నవంబర్‌ 21 తేదీన ఇస్రో మొట్టమొదటిసారి రెండు దశలతో కూడిన సౌండింగ్‌ రాకెట్‌ను కేరళలోని తుంబా ఈక్విటోరియల్‌ రాకెట్‌ కేంద్రం నుంచి ప్రయోగించి విజయం సాధించారు. అమెరికా, రష్యా, జపాన్‌, పశ్చిమ జర్మనీ, ప్రాన్స్‌ దేశాలు సహాయ సహకారాలతో నైక్‌ ఆపాచీ రాకెట్‌ను ప్రయోగించారు. ఆ తరువాత డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ ఆధ్వర్యంలో తుంబాలో సౌండింగ్‌ రాకెట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని, 1967 నవంబర్‌ 20న రోహిణి–75 అనే సౌండింగ్‌ రాకెట్‌ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి విజయం సాధించారు. ఆ తరువాత ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చి సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా పేరు మార్చారు. 1970లో డిపార్ట్‌మెంట్‌ స్పేస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1963లో తుంబా నుంచి వాతావరణ పరిశీలన కోసం సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగాలతో మన అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది.

తూర్పు తీర ప్రాంతంలో..

తుంబా రాకెట్‌ కేంద్రం పెద్ద ప్రయోగాలకు అనువుగా లేదని భారతదేశానికి మంచి రాకెట్‌ కేంద్రాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలనే కృత నిశ్చయంతో డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969లో తొలుత పడమటి తీరం అంటే అరేబియా సముద్ర తీరప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. ముందుగా గుజరాత్‌లో ఏర్పాటు చేయాలని అనుకుని, అక్కడ గ్రావిటీ పవర్‌ ఎక్కువగా ఉండడంతో తూర్పు తీరం అంటే బంగాళాఖాతం తీరప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. తూర్పు తీరాన పులికాట్‌ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చదరపు కిలో మీటర్లు విస్తరించిన శ్రీహరికోట దీవి ప్రాంతం గుర్తించారు. ఈ దీవి భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడం, గ్రావిటీ పవర్‌ తక్కువగా ఉండడంతో రాకెట్‌ ప్రయోగాలకు అనువుగా ఉందని శ్రీహరికోటను ఎంపిక చేశారు. భవిష్యత్తు రాకెట్‌ ప్రయోగాలను దృష్టిలో పెట్టుకుని వాతావరణ పరిశోధనకు సుమారు 1,161 సౌండింగ్‌ రాకెట్లు ప్రయోగించిన తరువాత పెద్ద ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి ఇప్పటివరకు 102 ప్రయోగాలు చేయగా 92 విజయవంతం అయ్యాయి. ఆరు రకాల రాకెట్‌ల ద్వారా 132 స్వదేశీ ఉపగ్రహాలు, 18 విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహాలు, 433 విదేశీ ఉపగ్రహాలు, 9 రీ ఎంట్రీ మిషన్లు, రెండు ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థలకు చెంది ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలోనే రెండోస్థానంలోకి చేరడం విశేషం.

ఆర్యభట్టతో తొలి అడుగు

బెంగళూరులో శాటిలైట్‌ తయారీ కేంద్రంలో 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని తయారు చేసుకుని రష్యా నుంచి ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల వేటను ఆరంభించారు. అనంతరం శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం పూర్తిస్థాయిలో నిర్మించిన తరువాత మొదటి ప్రయోగవేదిక నుంచి 1979 ఆగస్టు 10 ఎస్‌ఎల్‌వీ–3 ఇ1 పేరుతో రాకెట్‌ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. దురదృష్ట వశాత్తూ ఆ ప్రయోగం విఫలం కావడంతో నాటి శాస్త్రవేత్తలు కుంగిపోయారు. ఒక అపజయం మున్ముందు విజయాలకు నాంది అన్నట్టుగా నాటి శాస్త్రవేత్తలు మొక్కవోని ధైర్యంతో 1980 జులై 18న చేసిన ఎస్‌ఎల్‌వీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీంతో మన శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేసి ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం–3, ఎస్‌ఎస్‌ఎల్‌వీ, హెచ్‌ఆర్‌ఎల్‌వీ లాంటి భారీ ప్రయోగాలు చేసేస్థాయికి ఎదిగారు. కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌ (సమాచార ఉపగ్రహాలు) రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్స్‌ (దూరపరిశీలన ఉపగ్రహాలు), ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం (భారత క్షేత్రియ దిక్చూచి ఉపగ్రహాలు), వాతావరణ పరిశోధనా ఉపగ్రహాలు, గ్రహంతర ఉపగ్రహాలు (చంద్రయాన్‌–1, మంగళ్‌యాన్‌–1, చంద్రయాన్‌–2, చంద్రయాన్‌–3, సూర్యయాన్‌–1) లాంటి భారీ ఉపగ్రహాలను అత్యంత తక్కువ వ్యయంతో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో విజయాలు సాధించారు. 2023 జులై 14న ప్రయోగించిన చంద్రయాన్‌–3 గత ఏడాది ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలం దక్షిణ ధృవంపై ల్యాండర్‌ దించి రోవర్‌తో చంద్రుడిపై పరిశోధనలు చేశారు. ఆరోజును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ సైన్స్‌ దినోత్సవం (నేషనల్‌ స్పేస్‌ డే)గా ప్రకటించి, ఈ నెల 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించుకోనున్నారు.

ఆర్యభట్ట ఉపగ్రహంతో

తొలి అడుగు

శ్రీహరికోటలో అత్యాధునిక సౌకర్యాలు

గఘన విజయం1
1/4

గఘన విజయం

గఘన విజయం2
2/4

గఘన విజయం

గఘన విజయం3
3/4

గఘన విజయం

గఘన విజయం4
4/4

గఘన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement