
ప్రభుత్వం సహకరిస్తే ఎన్‌సీసీ మరింత విస్తరణ
తిరుపతి సిటీ : రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌సీసీని మరింత విస్తరిస్తామని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలానీ తెలిపారు. ఆయన గురువారం ఎన్‌సీసీ నగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆధ్మాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతి ఎన్‌సీసీ గ్రూపును తొలిసారి సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి లక్ష్యంగా ఎన్‌సీసీలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. తిరుపతి ఎన్‌సీసీ గ్రూపు ఆధ్వర్యంలో క్యాడెట్లకు మెరుగైన శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎన్‌సీసీ క్యాడెట్లను సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వైపు నడిపిస్తూ ఉత్తమ పౌరులుగా సమాజానికి అందిస్తుండడం అభినందనీయమన్నారు. గణతంత్ర దినోత్సవాల్లో తిరుపతి గ్రూపు నుంచి పెద్ద సంఖ్య లో పాల్గొనేందుకు కఠోర శిక్షణ ఇవ్వడంతో పాటు పోటీతత్వాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నింపే ప్రయ త్నం చేయడం శుభపరిణామనన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఎన్‌సీసీ కమాండ్ కంట్రోల్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపా రు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఎన్‌సీసీ సేవలు మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అవసరమన్నారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఎన్‌సీసీ వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో ఎన్‌సీసీ ధ్రువీకరణ పత్రాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. సమావేశంలో తిరుపతి గ్రూప్ కమాండర్ కల్నల్ సతీందర్ దాహియా పాల్గొన్నారు.