
తిరుపతి కోర్టుకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
తిరుపతి రూరల్ : చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి శుక్రవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ వద్దనున్న కౌటింగ్ సెంటర్ వద్ద జరిగిన గొడవల్లో అక్రమంగా 36 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారని, అందులో 37వ నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని చేర్చినట్టు ఆయన వివరించారు. అక్రమంగా పెట్టిన కేసులో న్యాయస్థానం ముందు హాజరుకావడం జరిగిందన్నారు. అక్రమంగా పెట్టిన కేసులో తనతో పాటు 37 మంది కోర్టుకు రావాల్సి వచ్చిందని, ప్రతిపక్షంలో ఉన్నందున ఈ అక్రమ కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. తనతో పాటు కోర్టుకు వచ్చిన వారందరికీ ధైర్యం చెప్పిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అందరికీ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.
కారు దగ్ధం
శ్రీకాళహస్తి : పట్టణంలోని పురపాలక కార్యాలయం సమీపంలో ఓ కారు శుక్రవారం రాత్రి దగ్ధమైంది. ఓ మెకానిక్ షాప్‌లో వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగిసి పడటంతో మంటలు అంటుకున్నాయి. దీంతో కారు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
మట్టి వినాయకున్ని పూజిద్దాం
నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పిలుపు
తిరుపతి కల్చరల్: తిరుపతి ప్రజలు వినాయక చవితి వేడుకల్లో మట్టి వినాయకునికి పూజలు చేయాలని తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. తిరుపతి శ్రీవరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ కార్యాలయంలో శుక్రవారం పోస్టర్లను నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. మేయర్ మాట్లాడుతూ, చవితి ఉత్సవ, నిమజ్జన కార్యక్రమాల విషయంలో నగర పాలక సంస్థ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సాంప్రదాయబద్ధంగా చవితి వేడుకలు జరుపుకోవాలని కోరారు. అలాగే, ఈస్ట్ పోలీస్టేషన్ డీఎస్పీ భక్తవత్సలం వినాయక కమిటీ కమిటీ సభ్యులతో చర్చించారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు గుండాల గోపినాథ్‌రెడ్డి, కరాటే శ్రీనివాసులురెడ్డి, బాబు, కిరణ్, చెంగారెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, సుబ్బరామయ్య, రవిప్రసాద్, ఆనంద్ పాల్గొన్నారు.

తిరుపతి కోర్టుకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి