
బాబు.. ఏడిపింఛెన్
రీవెరిఫికేషన్ పేరుతో పింఛన్ల తొలగింపు లబోదిబోమంటున్న దివ్యాంగులు పేరుకే పింఛన్ పెంపు.. తొలగింపులే అధికం
దివ్యాంగుల బతుకుల్లో వెలుగులు నింపాల్సిన కూటమి ప్రభుత్వం వారిని మరింత కష్టాల్లోకి నెట్టింది. సాయంలేక నడవలేని అభాగ్యులు, సచ్చుబడిన కాళ్లతో తడబడుతూ వచ్చే దివ్యాంగులకు ఊతమివ్వకపోగా రీవెరిఫికేషన్ పేరుతో నోటికాడికి వచ్చే పింఛన్‌ను లాగేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న పింఛన్‌ను ఉన్న ఫలంగా తీసేస్తే దానిమీదే ఆధారపడిన బతుకులు తలకిందులవుతున్నాయి. పేరుకు పింఛన్ పెంచి..మరోవైపు రీవెరిఫికేషన్ పేరుతో తొలగిస్తుండడంపై దివ్యాంగులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నేత కార్మికుడిగా పింఛన్ సాకు చూపి..
ఈమె పేరు శశిరేఖ, వయస్సు 65 సంవత్సరాలు. నారాయణవనం పద్మావతీ నగర్‌లో ఉంటోంది. రెండు కళ్ల చూపు పూర్తిగా లేకపోవడంతో 75 శాతం వైకల్యంతో సదరన్ సర్టిఫికెట్‌ను ప్రభుత్వం అందజేసింది. దీంతో రూ. 6 వేల పింఛను పొందుతోంది. ఈమె భర్త వీరస్వామి(91) నేత కార్మికుడిగా నెలకు 4 వేల పింఛను అందుకుంటున్నాడు. వీరి ఒకానొక కుమారుడు మృతి చెందడంతో కుటుంబ పోషణ భారం కావడంతో ఏడాదిగా కార్వేటినగరంలోని వృద్ధాశ్రమంలో ఉంటోంది. సదరన్ సర్టిఫికెట్ రీవెరిఫికేషన్‌తో ఈమె వైకల్యాన్ని 30 శాతానికి తగ్గించడమే కాకుండా, భర్తకు పింఛను వస్తోందన్న కారణంతో ఈమె పింఛను రద్దు చేశారు. – నారాయణవనం
పింఛన్ తొలగింపుతో ఆధారం పోయింది
ఈయన పేరు ఉదయ్ భాస్క ర్. తిరుపతికి చెందిన వ్యక్తి. పోలియో బాధితుడు. 2018లో జరిగిన రోడ్డు ప్ర మాదంలో నడవలేని స్థితి. రెండు కాళ్లు, నడుము దెబ్బ తినడంతో పైకి లేవలేని స్థితిలో ఉన్నాడు. గతంలో పింఛన్ కోసం వైద్య పరీక్షలు నిర్వహించగా 90 శాతం వైకల్యంతో సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. దాని ఆధారంగా ఏడేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నాడు. పింఛను నగదుపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఈయన భార్య పుష్పలత ఉద్యోగానికి వెళితే ఉదయ్ భాస్కర్‌ను చూసుకునే వారు లేదు. ఇటీవల వెరిఫికేషన్ పేరుతో అర్హత లేకుండా చేశారు. నా భర్తను ఎలా పోషించాలి అంటూ పుష్పలత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –తిరుపతి తుడా
కన్నులేకున్నా కనికరించలే..
అతడి పేరు తీరాశెటి చిన్న బాలయ్య. ఓజిలి మండలంలోని కురుగొండ. ఎడమ కన్ను లేదు. గత ప్రభుత్వంలో అధికారులు 45 శాతం కంటే ఎక్కువగా అంధత్వం ఉందని ధ్రువీకరణ పత్రం ఇవ్వడంతో రూ.6 వేలు పింఛన్ ఇస్తుండేవారు. ప్రస్తుత ప్రభుత్వం 40 శాతం ఉందని గుర్తించి ఆరు వేలు వస్తున్న పింఛన్‌ను 4 వేలకు తగ్గించారు. కన్ను లేకున్నా కనికరం లేకుండా పింఛన్‌ను తగ్గించడం మంచి పద్ధతి కాదని విలపిస్తున్నాడు. – ఓజిలి

బాబు.. ఏడిపింఛెన్

బాబు.. ఏడిపింఛెన్