దమ్ముంటే పట్టుకోండి? | - | Sakshi
Sakshi News home page

దమ్ముంటే పట్టుకోండి?

Aug 23 2025 6:21 AM | Updated on Aug 23 2025 6:21 AM

దమ్ము

దమ్ముంటే పట్టుకోండి?

చిత్తూరు మండలం, అనంతాపురం గ్రావిటా ఫ్యాక్టరీ వద్ద గురువారం మధ్యాహ్నం ఓ లారీ టైర్‌ పేలి నిలిచిపోయింది. అటుగా వెళ్లిన గ్రామస్తులు లారీ కింది భాగంలో నీళ్లతో కూడిన ఇసుక రాలడంతో అనుమానం కలిగింది. లారీపైన కప్పిన పట్ట విప్పి చూస్తే అసలు విషయం బయటపడింది. ఇసుకపై వరి పొట్టు బ్యాగులు నింపి సరిహద్దు దాటిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ లారీ తిరుపతి జిల్లా, గూడూరు ప్రాంతం నుంచి తమిళనాడుకు వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఆరు నెలలకు క్రితం గూడూరు నుంచి చిత్తూరు మండలం మీదుగా వెళుతున్న ఇసుక లారీని పోలీసులు పట్టుకున్నారు. బీఎన్‌ఆర్‌పేట చెక్‌పోస్టు వద్ద పట్టుకుని కేసు నమోదు చేశారు. నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తితో పాటు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

గంగాధరనెల్లూరు మండలంలో మూడు నెలలకు ముందు గూడూరు నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలుతున్న ఇసుక లారీని పట్టుకున్నారు. జరిమానా వేసి వదిలేశారు. అలాగే గుడిపాల మండలంలో కూడా రెండు నెలలకు క్రితం ఓ లారీ పట్టుబడింది. తమిళనాడుకు వెళ్తున్న క్రమంలో పట్టుకున్నారు. కానీ జరిమానా వేసి పంపించేశారు.

గూడూరు నుంచి చిత్తూరు మండలం మీదుగా తమిళనాడుకు తరలింపు పట్టించుకోని మైనింగ్‌శాఖ అధికారులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు మండలం తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉంది. మండలం మీదుగా రాకపోకలు సులభతరంగా ఉంటాయి. బంగారెడ్డిపల్లి గ్రామం వద్ద ఎంట్రీ ఇస్తే.. బీఎన్‌ఆర్‌పేట మీదుగా జిల్లా సరిహద్దును 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో దాటేయొచ్చు. తమిళనాడు సరిహద్దులోకి చేరుకుంటే పొన్నై, సోలింగరం, తిరుత్తణి మీదుగా చైన్నైకి దూసుకెళ్లవచ్చు. మళ్లీ చిత్తూరు మండలం నుంచి గుడిపాల మండలం మీదుగా తమిళనాడుకు చేరుకోవచ్చు. లేకుంటే కమ్మతిమ్మపల్లి మీదుగా తమిళనాడులో అడుగుపెట్టవచ్చు. అలాగే జీడీనెల్లూరు మండలం మీదుగా వస్తే..తూగుండ్రం నుంచి పొన్నైకు చేరుకుని బండిని చైన్నెకి తిప్పొచ్చు. దీనికి తోడు దొడ్డిదారులను అక్రమార్కులు ఎంచుకుని సరిహద్దులు దాటిస్తున్నారు.

ఇక్కడి నుంచే వ్యాపారం

గూడూరు కేంద్రంగా ఇసుక వ్యాపారం జోరందుకుంటోంది. నెల్లూరు జిల్లాలోని పెన్నానదిలో తవ్వకాలు చేసి గూడూరులో డంప్‌ చేసుకుంటున్నారు. అలాగే గూడూరు పరిధిలోని స్వర్ణముఖి నదిలో కూడా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడ లారీలో ఇసుక నింపి.. పుష్పారేంజ్‌లో ఇసుకను తమిళనాడుకు చేర్చే ప్ర యత్నం చేస్తున్నారు. వరిపొట్టు, వరి, కూరగాయలు, బియ్యం, నిత్యావసర సరుకులు తదితర పేర్లతో వేబిల్లులు వేసుకుని చిత్తూరు మండలం, జీడీనెల్లూరు, గుడిపాల మీదుగా తమిళనాడు చేరుస్తున్నారు.

తమిళనాడు వ్యక్తులతోనే వ్యాపారం

గూడూరులో జరిగే ఇసుక తవ్వకాల్లో తమిళనాడుకు చెందిన వ్యక్తులే కీలకంగా పనిచేస్తున్నారు. లారీకి ఇసుక నింపడం నుంచి తమిళనాడు రాష్ట్రంలో ఇసుక దింపే వరకు ఆ రాష్ట్ర వాసులే దగ్గరుండి పనిచేస్తున్నారు. కూటమి నేతలు తమిళనాడు కూలీలను నమ్మకంగా పెట్టుకుంటున్నారు. వీళ్లు తమిళనాడులోని ఇసుక దందాదారులతో చేతులు కలిపి అమ్మకాలు చేస్తున్నారు. లారీ ఇసుక రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వీరందరికీ నెల్లూరులోని ఓ కూటమి నేత బాస్‌గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.

నిఘా ఏదీ?

చిత్తూరు, గుడిపాల, జీడీనెల్లూరు మండలాల మీదుగా జరుగుతున్న ఈ ఇసుక దందాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. క్షేత్ర స్థాయిలోని గ్రామస్తులు పట్టిస్తే తప్ప అధికారులు కదలడం లేదు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘా లేదు. దీనికారణంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఒక వేళ పట్టుకున్నా కేసులు.. జరిమానాలతో సర్దేస్తున్నారు. ఇక ఇసుక పట్టుకుంటే బడా కూటమి నేతల నుంచి అధికారులకు ఫోన్లు వస్తున్నాయి. కొందరైతే ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలో అధికారులు ఇసుక లారీలను వదిలిపెట్టాల్సి వస్తోంది.

..జిల్లాలో ఇలాంటివి నిత్యకృత్యంగా మారా యి. అధికార మదంతో కూటమి నేతలు అందినకాడికి ఇసుక తరలించేస్తున్నారు. సరిహద్దులు దాటించి జేబులు నింపుకుంటున్నారు. పోలీసులు కేసులు, జరిమానాలతో చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఎవరిపైనా చర్యలకు ఉపక్రమించే ధైర్యం చేయలేకపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

పుష్ప రేంజ్‌లో కూటమి నేతల ఇసుక వ్యాపారం

రెండు జిల్లాల అధికారుల

సహకారంతోనేనా..?

ఈ అక్రమ ఇసుక వ్యాపారానికి తిరుపతి, చిత్తూరు జిల్లాల అధికారులు పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ అక్రమ వ్యాపారం గూడూరు నుంచి తమిళనాడుకు విస్తరించింది. ఇసుకాసురులుగా అవతామెత్తిన కూటమి నేతలకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ ఉంది. ఈ నెట్‌వర్క్‌తోనే ఈ అక్రమ వ్యాపారాన్ని జోరుగా నడిపిస్తున్నారు.

దమ్ముంటే పట్టుకోండి?1
1/1

దమ్ముంటే పట్టుకోండి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement