
జానపద విజ్ఞానాన్ని కాపాడుకోవాలి
తిరుపతి సిటీ : మరుగున పడుతున్న జానపద విజ్ఞానాన్ని కాపాడుకోవాలని వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ జానపద విజ్ఞాన దినోత్సవాన్ని శుక్రవారం ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీసీ మాట్లాడుతూ.. ప్రాచీనమైన ఎన్నో జానపద కళలు అంతరిస్తున్నాయన్నారు. సరైన ఆదరణ లేకపోవడమే జానపద కళలు అంతరించడానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. జానపద కళలను రాబోయే తరానికి అందించాలని సూచించారు. రిజిస్ట్రార్ భూపతి నాయుడు మాట్లాడుతూ.. జానపద కళల్లో ఎన్నో విజ్ఞానదాయక విషయాలు దాగి ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు, నృత్యాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు,
ప్రభుత్వ పాఠశాలలు దత్తత
నాయుడుపేటటౌన్ : మండల పరిధిలోని గిరిజన కాలనీల్లో ఉన్న 8 ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలలను దత్తత తీసుకుంటామని రోటరీ క్లబ్ అధ్యక్షుడు అదవరం నాగూరయ్య వెల్లడించారు. పట్టణంలోని ట్రీనీటి వైద్యశాలకు సంబంధించి వైద్యుల ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు ఉచితంగా వైద్య సేవలను అందించ డం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని మొదటగా మండల పరిధిలోని మందబైలు గిరిజన కాలనీలో ప్రభుత్వ వైద్యశాల వద్ద శుక్రవారం విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు. ప్రతి నెలా ట్రీనిటి శిశు సంజీవిని పేరుతో దత్తత తీసుకున్న ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా అన్ని రకాల వైద్య చికిత్సలు చేసి మందులు అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వైద్యంతో పాటు విద్యాపరంగా తమ వంతు సహకారం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అదవరం అలైనా ప్రిషా విద్యార్థులకు విద్యాసామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మునిరత్నం, వైద్యులు ఆదవరం సందీప్, దీప్తి, అనుదీప్, నీలిమ, లతీఫ్, ఆదవరం పవని, జువ్వలపాళెం సర్పంచ్ తొప్పని రమణయ్య, హెచ్‌ఎం మస్తానయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్ సుగుణమ్మ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూ లైన్ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 65,112 మంది స్వామి వారిని దర్శించుకోగా 27,331 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనమవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.